బ్యాడ్ బాయ్ కార్తీక్ టీజర్.. నాగశౌర్య టాలెంట్ ని వేస్ట్ చేసుకుంటున్నాడా?
on Oct 6, 2025

ప్రస్తుతం ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయింది. ఐతే భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. లేదంటే, సరదాగా నవ్వుకునే సినిమాలో లేక కొత్తదనం ఉన్న సినిమాలో చూస్తున్నారు. అంతేకానీ.. మూడు ఫైట్లు, ఆరు పాటలు ఫార్మాట్ లో సాగే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూడటానికి ఇష్టపడట్లేదు. అయినప్పటికీ కొందరు మేకర్స్ అలాంటి సాహసం చేస్తున్నారు.
ఊహలు గుసగుసలాడే, కళ్యాణ వైభోగమే, జ్యో అచ్యుతానంద, ఛలో వంటి సినిమాలతో.. టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ హీరోలలో ఒకడిగా నాగశౌర్య (Naga Shaurya) కనిపించాడు. కానీ, కథల ఎంపికలో తడబడుతూ విజయాల వేటలో వెనకబడుతున్నాడు. నాగశౌర్య సాలిడ్ సక్సెస్ చూసి చాలా కాలమైంది. ఛలో తర్వాత భారీ విజయాన్ని చూడలేదు. చివరగా రెండేళ్ల క్రితం వచ్చిన 'రంగబలి'తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కిన ఆ మూవీ.. అక్కడక్కడా నవ్వించినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించలేకపోయింది. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ అదే బాటలో పయనిస్తూ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' అనే మరో రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ తో వస్తున్నాడు.
తాజాగా 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్ విడుదలైంది. టీజర్ లో కామెడీ కానీ, కొత్తదనం కానీ కనిపించలేదు. అంతా రెగ్యులర్ గానే ఉంది. మరి సినిమాలో దీనికి భిన్నంగా కొత్త పాయింట్ ఏమైనా ఉంటుందేమో ఇప్పుడే చెప్పలేము. (Bad Boy Karthik Teaser)
'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్ విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నాగశౌర్య లుక్, పర్సనాలిటీ పరంగా హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. టాలెంట్ కూడా ఉంది. తన రూపానికి, ప్రతిభకి తగ్గ మంచి కథలు ఎంచుకుంటే.. హీరోగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడొస్తున్న కొత్త హీరోలు విభిన్న సినిమాలతో హిట్స్ కొడుతుంటే.. నాగశౌర్య మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయాడని, త్వరగా ఆయన తన ట్రాక్ మారిస్తే మంచిదని శౌర్యను ఇష్టపడేవారు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



