భారతీయ సంగీత దిగ్గజం, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కుటుంబంలో తీవ్ర ఆందోళన రేపిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన కుమారుడు, యువ ప్లేబ్యాక్ సింగర్ ఏఆర్ అమీన్ ప్రయాణిస్తున్న కారు సోమవారం వేకువజామున చెన్నైలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ఆయన స్వల్ప గాయాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు, అభిమానులు తీవ్ర ఊపిరి పీల్చుకున్నారు.
చెన్నైలోని గిండి ప్రాంతంలో ఉన్న ఒలింపియా టెక్ పార్క్ సిగ్నల్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కోయంబేడు నుంచి గిండి వైపు తన స్నేహితుడితో కలిసి అమీన్ కారులో వెళ్తుండగా, పక్క రోడ్డు నుంచి వేగంగా వచ్చిన మరొక వాహనం (క్యాబ్) వీరి కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదం తీవ్రతకు రెండు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అడియార్ ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన అమీన్, ఆయన స్నేహితుడిని వెంటనే కావేరి ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ధృవీకరించి, డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇక తండ్రి తగ్గ తనయుడిగా మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు అమీన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. చిన్నతనంలోనే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారమ్’ సినిమాలోని 'మౌలా వా సలీమ్' పాటతో ప్లేబ్యాక్ సింగర్‌గా పరిచయమైన అమీన్, ఇటీవల రామ్ చరణ్ 'పెద్ది' చిత్రంలోని తమిళ్ వెర్షన్ ‘చికిరి చికిరి’ సహా పలు ప్రైవేట్ ఆల్బమ్స్ లో తన స్వరాన్ని అందించారు.
ఏఆర్ అమీన్ కారు ప్రమాదానికి గురయ్యారనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారనే వార్త తెలియడంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు "గాడ్ ఈజ్ గ్రేట్" అంటూ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.






