Home

»

Latest News

రంగంలోకి దిగిన అనుష్క..  ప్రమోషన్స్ కోసం స్వీటీ భారీ ప్లాన్!

Apr 09, 2026

- ప్రమోషన్స్‌లో స్వీటీ మెరవనుందా?

- జయసూర్య పీరియడ్ డ్రామాలో అనుష్క

- పాన్ ఇండియా రేంజ్‌లో 'కథనార్' సందడి

టాలీవుడ్ ‘జేజమ్మ’ అనుష్క శెట్టి పేరు వింటేనే అభిమానుల్లో ఒక రకమైన పూనకం వస్తుంది. తన అద్భుతమైన నటనతో, హుందాతనంతో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న ఈ సీనియర్ హీరోయిన్, గత కొంతకాలంగా వెండితెరకు కాస్త దూరంగా ఉంటూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. అయితే ఇప్పుడు స్వీటీ ఫ్యాన్స్ కోసం ఒక అదిరిపోయే అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె తొలిసారిగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘కథనార్‌ - ది వైల్డ్ సోర్సెరర్’ ప్రమోషన్స్ విషయంలో అనుష్క ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మలయాళ స్టార్ హీరో జయసూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 90 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ ఫాంటసీ థ్రిల్లర్‌లో అనుష్క ఒక పవర్‌ఫుల్ రోల్‌లో మెరవనుంది. సాధారణంగా అనుష్క సినిమా ప్రమోషన్స్ అంటే చాలా సైలెంట్‌గా ఉంటారు. కానీ ఈ చిత్రం తన కెరీర్‌లోనే ప్రత్యేకమైనది కావడం, పైగా మలయాళంలో తన డెబ్యూ మూవీ కావడంతో.. ప్రమోషన్స్ కోసం ఆమె ప్రత్యేకంగా రంగంలోకి దిగబోతున్నారట.

ఈ సినిమా ప్రమోషన్స్ కేవలం కేరళకే పరిమితం కాకుండా, సౌత్ ఇండియా మొత్తం గ్రాండ్‌గా నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో జరిగే ఈవెంట్స్‌లో అనుష్క స్వయంగా పాల్గొని సినిమాపై హైప్ క్రియేట్ చేయనున్నారట. బాహుబలి, భాగమతి వంటి సినిమాల తర్వాత అనుష్క క్రేజ్ దేశవ్యాప్తంగా ఉండటంతో, ఆమె రాకతో సినిమాకు భారీ పబ్లిసిటీ లభిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

‘కథనార్’ చిత్రం 9వ శతాబ్దానికి చెందిన ఒక మాంత్రికుడి కథ ఆధారంగా రూపొందుతోంది. రోజిన్ థామస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అత్యాధునిక 'వర్చువల్ ప్రొడక్షన్' టెక్నాలజీని వాడారు. హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ ఉండబోతున్నాయని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ చిత్రంలో అనుష్క 'నీలి' అనే మిస్టీరియస్ పాత్రలో కనిపిస్తుండగా, ఆమె లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుదేవా కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం.

చాలా కాలం తర్వాత తన ఫేవరెట్ హీరోయిన్‌ను ప్రమోషన్స్ లో చూసే అవకాశం కలగడంతో అనుష్క ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో స్వీటీ ఈవెంట్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత అనుష్క నుంచి వస్తున్న భారీ ప్రాజెక్ట్ కావడంతో ఇండస్ట్రీలోనూ దీనిపై గట్టి చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర‌మోష‌న్స్‌కి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే అధికారికంగా వెలువడనుంది. మరి తన నటనతో మలయాళ ప్రేక్షకులను కూడా జేజమ్మ ఎలా మెప్పిస్తుందో చూడాలి!

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com