టెలివిజన్ నటుడు అనూజ్ ఠాకూర్ (33) కన్నుమూశారు. ముంబైలోని ఓషివారాలో ఉన్న తన నివాసంలో అక్టోబర్ 27న ఆయన తుదిశ్వాస విడిచారు. నిద్రలో ఉండగా మూర్ఛ (సీజర్) రావడంతోనే ఆయన మరణించినట్లు స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్ రూపేష్ సోనార్ వెల్లడించారు. ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనూజ్ మృతి గురించి రూపేష్ సోనార్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అనూజ్ తనకు స్నేహితుడు మాత్రమే కాదని, తమ్ముడిలాంటి వాడని గుర్తుచేసుకున్నారు. ఆయనతో కలిసి ఎన్నో ప్రాజెక్టులు చేయాలని అనుకున్నామని, కానీ ఇంతలోనే ఇలా జరగడం బాధాకరమని పేర్కొన్నారు. మరణానికి పది రోజుల ముందు కూడా అనూజ్‌ను కలిశానని, అప్పట్లో ఆయన మళ్లీ నటనలోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారని రూపేష్ వెల్లడించారు.
అనూజ్ ప్రతిరోజూ తెల్లవారుజామున 4.30 గంటలకే నిద్రలేచి వ్యాయామం, జాగింగ్ చేసేవారని రూపేష్ తెలిపారు. అయితే అక్టోబర్ 27న అలారం మోగినా ఆయన నిద్రలేవకపోవడంతో తల్లి గదిలోకి వెళ్లి చూడగా స్పందన లేకుండా కనిపించారని చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ అనూజ్‌కు ఒకసారి మూర్ఛ వచ్చిందని, అప్పటి నుంచి మందులు వాడుతున్నారని కుటుంబ సభ్యులు తనకు చెప్పినట్లు రూపేష్ వివరించారు.
‘ధూమ్ మచావో ధూమ్’, ‘బంధన్ సాత్ జన్మో కా’, ‘బీంద్ బనూంగా ఘోడి చఢూంగా’, ‘మహిసాగర్’ వంటి టెలివిజన్ షోలతో అనూజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉన్న ఆయన తిరిగి బుల్లితెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆయన మృతితో టీవీ పరిశ్రమలో విషాదం నెలకొంది.
[Anuj Thakur, Anuj Thakur Death, TV Actor Anuj Thakur, Anuj Thakur Dies at 33, Dhoom Machao Dhoom Actor, Rupesh Sonar, Television Actor Death, TV Industry News]





