
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మూవీ 'పెద్ది' (Peddi). బుచ్చిబాబు దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ నిర్మించిన ఈ మూవీ ఇటీవల విడుదలైంది. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను చూపించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణలు తెలిపారు. అభ్యంతకర సన్నివేశాలను తొలిగిస్తామని చెప్పారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తుండగా, తాజాగా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.
సినిమా అనేది ఎప్పుడూ సమాజానికి ప్రతిబింబంగానే ఉంటుందని, అయితే సమాజాన్ని కేవలం సినిమాలే మార్చాలని లేదా చైతన్యపరచాలనే పూర్తి బాధ్యతను వాటిపైనే నెట్టేయడం కరెక్ట్ కాదని అనసూయ అభిప్రాయపడ్డారు. ఒక వ్యక్తిగా మనందరికీ ఏది తప్పు, ఏది రైట్ అని తెలుసుకునే విచక్షణ, బాధ్యత ఉండాలని, సినిమాల ద్వారా పేరెంటింగ్ జరగాలని తాను నమ్మడం లేదని అనసూయ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈ విషయాన్ని చెబుతూనే, కథకులుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ల బాధ్యతను తక్కువ చేసి చూపించలేమని ఆమె అన్నారు. సినిమా అనేది చాలా శక్తివంతమైన మాధ్యమం అని పేర్కొన్నారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అది సమాజంలో చర్చలను లేవనెత్తుతుందని, ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుందని, కొన్నిసార్లు ప్రవర్తనను కూడా ప్రేరేపిస్తుందని ఆమె గుర్తు చేశారు.
పూర్వ కాలంలో ప్రేక్షకులు ఒక కథలోని నైతిక విలువలను చాలా సులభంగా అర్థం చేసుకునేవారని, హీరో అంటే ఆదర్శంగా తీసుకునే పాత్రగా, విలన్ అంటే మనం అనుకరించకూడని నెగటివ్ పాత్రగా స్పష్టత ఉండేదని వివరించారు. కానీ నేటి రోజుల్లో ఆ గీత చాలా వరకు చెరిగిపోయిందని, క్యారెక్టర్లు ఎంతో క్లిష్టంగా మారిపోవడంతో కొన్నిసార్లు పాత్రలను చూపించడమే కాకుండా వాటిని గ్లోరిఫై చేయడం కూడా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాను ఇటువంటి సామాజిక విషయాలపై మాట్లాడిన ప్రతిసారీ.. సెన్సార్‌షిప్ చేయాలనో లేక మోరల్ పోలీసింగ్ చేయాలనో డిమాండ్ చేయడం లేదని స్పష్టం చేశారు. కేవలం బాధ్యతాయుతమైన స్పృహ మాత్రమే కోరుకుంటున్నానని అనసూయ తెలిపారు.
ఒక కథను ప్రజల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు దానికి సంబంధించిన రచయిత, దర్శకుడు, నిర్మాత, నటుడితో పాటు చూసే ప్రేక్షకులకు కూడా దాని ప్రభావంపై పూర్తి బాధ్యత ఉంటుందని గుర్తుచేశారు.
తాను ఎప్పుడూ నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి ఉంటానని, అందుకే ఒక షో టీమ్ యొక్క క్రియేటివిటీకి తన అభిప్రాయాలు అడ్డురాకూడదనే ఉద్దేశంతో ఆ షో నుండి తప్పుకున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత పరిశ్రమలో తన ప్రతిభకు తగ్గ ప్లాట్‌ఫామ్ దక్కించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డానని, అయినా తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ వెనకడుగు వేయలేదని అన్నారు.
సినిమాల్లో క్రియేటివ్ ఫ్రీడమ్ ఎంత ముఖ్యమో, అదే సమయంలో సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని అనసూయ చెప్పారు. ఈ రెండూ కలిసికట్టుగా సాగాలన్నదే ఆమె అభిప్రాయం. సినిమాలు సమాజానికి తల్లిదండ్రుల్లా బుద్ధులు నేర్పాలని ఆశించలేము, అలాగని సినిమాలకు అసలు ప్రభావమే లేదని కూడా అనలేమని ఒక అద్భుతమైన ముగింపునిచ్చారు. అనసూయ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.






