చిత్రపరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 'తగ్గేదే లే' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన యువ నటి అనన్య రాజ్ (27) అకాల మరణం చెందారు. గత కొంతకాలంగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
అనన్య మృతిపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) అత్యంత భావోద్వేగంగా స్పందించింది. కేవలం 27 ఏళ్ల పిన్న వయసులోనే ఆమె మనల్ని విడిచివెళ్లడం కలచివేస్తోందని పేర్కొంది. గత ఏడాది కాలంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ఒక ధీర నారిలా పోరాడి, ఒక రాణిలా బతికిందని అసోసియేషన్ నివాళులర్పించింది.
మరోవైపు అనన్య కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తంచేశారు. "నువ్వు లేని లోటు ఏనాటికీ పూడ్చలేనిది.. ఏడాది పాటు నువ్వు చూపించిన ధైర్యం అందరికీ ఆదర్శం" అంటూ పోస్ట్ చేయడంతో నెటిజన్లు కంటతడి పెట్టుకుంటున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు.
మోడలింగ్ రంగం నుంచి నటన వైపు అడుగులు వేసిన అనన్య రాజ్, బాలీవుడ్‌లో '7 అవర్స్ టు గో', 'ది ఫైనల్ ఎగ్జిట్', 'ఘోస్ట్' వంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో నవీన్ చంద్ర కథానాయకుడిగా, శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో వచ్చిన 'తగ్గేదే లే' చిత్రంలో తన నటనతో ప్రత్యేక ముద్ర వేశారు. ఆ తర్వాత 'మద్రాసీ గ్యాంగ్' అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు.
ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటి ఇలా చిన్న వయసులోనే దూరమవ్వడం పట్ల టాలీవుడ్ సహా బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు ప్రశాంతత కలగాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Ananya Raj, Ananya Raj Death, Thaggedhe Le Actress, Telugu One News, Entertainment News Telugu






