
విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన మూవీ ‘అనకాపల్లి’. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన నిర్మించిన ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకుడు. ఆగస్టు 7న విడుదల కావాల్సి ఉంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. అయితే విడుదలకు కొద్దిగంటల ముందు మూవీ టీమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ‘అనకాపల్లి’ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి గల కారణాలను కూడా వెల్లడించింది.
ఇటీవల ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిర్వహించిన డిస్ట్రిబ్యూటర్స్ షోకు అద్భుతమైన స్పందన లభించింది. సినిమా కంటెంట్ చూసిన పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని కేవలం తెలుగు వరకే పరిమితం చేయకుండా, ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
అదే సమయంలో చిత్రంపై OTT ప్లాట్‌ఫామ్స్ నుంచి కూడా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, తొందరపడి విడుదల చేయడం కంటే సినిమాకు లభిస్తున్న అవకాశాలను పూర్తిగా పరిశీలించి, సరైన ప్రణాళికతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది.
ఓ వైపు సినిమా విడుదల వాయిదా వేస్తూనే, మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ‘అనకాపల్లి’ టీమ్. “ముందు ప్రజల తీర్పు… ఆ తర్వాత రిలీజ్” అనే నిర్ణయంతో టీమ్ ముందుకు వెళ్తోంది.
"ఈ సినిమా పేరు ‘అనకాపల్లి’. ఈ సినిమా కథకు, షూటింగ్‌కు వేదిక అనకాపల్లి. ఈ చిత్ర నిర్మాత కూడా అనకాపల్లి బిడ్డే. అందుకే ఈ సినిమా మీద మాకున్న నమ్మకంతో, థియేట్రికల్ రిలీజ్‌కు ముందే అనకాపల్లి పట్టణంలో 4 నుంచి 5 ప్రత్యేక పబ్లిక్ షోలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాం." అని తెలిపింది.
"డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, OTT ప్లాట్‌ఫామ్స్ చూపిస్తున్న ఆసక్తి, ఇతర భాషల్లో విడుదల చేసే అవకాశాలు, అన్నింటికంటే ముఖ్యంగా అనకాపల్లి ప్రజల నుంచి వచ్చే తొలి తీర్పు — వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని కొత్త విడుదల తేదీని నిర్ణయించనున్నాం. కొత్త విడుదల తేదీని ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటిస్తాం." అని అనకాపల్లి మూవీ టీమ్ పేర్కొంది.





