ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాత సినిమాలు ఎప్పుడు టీవీల్లో వచ్చినా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అయితే, తాజాగా బన్నీ కెరీర్‌లోని ఒక సూపర్ హిట్ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దాదాపు దశాబ్ద కాలం క్రితం వచ్చిన సినిమాలోని ఒక సీన్‌లో ప్రస్తుత రాజకీయ ప్రముఖుడికి సంబంధించిన విజువల్స్ వెలుగులోకి రావడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ప్రస్తుతం ఒక పాత మూవీ క్లిప్ విపరీతంగా షేర్ అవుతోంది. అందులో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించిన షీలా బస్ స్టాండ్‌లో కూర్చుని ఉండే సన్నివేశం కనిపిస్తుంది. ఆ సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన నెటిజన్లు.. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న వాల్ పోస్టర్‌ను గుర్తించారు. ఆ పోస్టర్‌పై ఉన్న ముఖచిత్రం మరెవరిదో కాదు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిది కావడం విశేషం.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, దిల్‌రాజు నిర్మాణంలో వచ్చిన ‘పరుగు’ (2008) సినిమా షూటింగ్ సమయంలో ఈ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. అప్పట్లో ఒక సాధారణ బస్ స్టాండ్ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు, అక్కడ గోడకు ఉన్న పొలిటికల్ పోస్టర్ అనుకోకుండా కెమెరా కంటికి చిక్కింది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం తొలినాళ్లలో, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న కాలానికి సంబంధించిన పసుపు రంగు వాల్ పోస్టర్ అది.
అప్పట్లో సినిమా చూసిన వారు ఎవరూ పెద్దగా గమనించని ఈ చిన్న విషయాన్ని, ఇన్నేళ్ల తర్వాత డిజిటల్ యుగంలో నెటిజన్లు స్క్రీన్ షాట్స్ తీసి మరీ బయటకు తీశారు. దాదాపు 16 ఏళ్ల క్రితం ఒక సాధారణ నాయకుడిగా ఉన్న వ్యక్తి, కాలక్రమంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అటు బన్నీ ఫ్యాన్స్, ఇటు రేవంత్ రెడ్డి అనుచరులు ఈ అరుదైన వీడియోను తెగ ట్రెండ్ చేస్తున్నారు.






