ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్‌లోని తన తొలి మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నారు. ఏషియన్ గ్రూప్‌తో భాగస్వామ్యంతో విశాఖపట్నంలో అత్యాధునికంగా నిర్మించిన 'AAA సినిమాస్' (AAA Cinemas) మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు బన్నీ ఈ నెల 9న వైజాగ్ విచ్చేయనున్నారు. దీంతో వైజాగ్‌లో టాలీవుడ్ హడావుడి పెరిగింది.
అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు, నిర్వాహకులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఈసారి సాధారణ ప్రేక్షకులకు, అభిమానులకు ప్రాంగణంలోకి ప్రవేశాన్ని నిరోధిస్తూ ఆంక్షలు విధించారు.
కేవలం ఆహ్వాన పత్రికలు ఉన్న విఐపిలు, ప్రత్యేక అతిథులు, నిర్వాహకులకు మాత్రమే మల్టీప్లెక్స్ ప్రారంభ ప్రాంతంలోకి ప్రవేశం ఉండనుంది. అల్లు అర్జున్ మాల్‌లోకి వచ్చి ప్రారంభోత్సవం పూర్తి చేసుకుని, తిరిగి వెళ్లేంత వరకు మాల్ సముదాయాన్ని సాధారణ ప్రజల కోసం తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గతంలో హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఎదురైన చేదు అనుభవాలు, తొక్కిసలాట సంఘటనల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. విశాఖ పోలీసులు మరియు మల్టీప్లెక్స్ యాజమాన్యం సమన్వయం చేసుకుంటూ ఈ ప్రత్యేక భద్రతా ప్రణాళికను అమలు చేస్తున్నారు.
అయితే విశాఖపట్నం వచ్చి తమ అభిమాన కథానాయకుడిని నేరుగా చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం మాల్ వెలుపల ఒక వేదికను సిద్ధం చేసే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ నుండి బన్నీ అభిమానులకు అభివాదం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఎంతో పేరు తెచ్చుకున్న AAA సినిమాస్, ఇప్పుడు ఎనిమిది అత్యాధునిక స్క్రీన్లతో ఆంధ్రాలో కూడా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస గ్లోబల్ ప్రాజెక్ట్‌లతో ఎంతో బిజీగా ఉన్నారు. 'పుష్ప 2' సృష్టించిన ప్రభంజనం తర్వాత ఆయన నటిస్తున్న తదుపరి సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో వ్యాపారపరంగా కూడా అడుగుపెడుతున్న బన్నీ ప్రాజెక్ట్ విశాఖ సినీ ప్రియుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.






