Home

»

Latest News

హీరో అఖిల్ రాజ్ కారుపై రాళ్ల దాడి.. డెలివరీ బాయ్ పగతో గచ్చిబౌలిలో కలకలం!

Jul 1, 2026 4:46PM

'రాజు వెడ్స్‌ రాంబాయి' చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్‌ రాజ్‌ ఉద్దెమరి, ఒక సాధారణ ఫుడ్ డెలివరీ బాయ్‌ మధ్య మొదలైన చిన్న తగాదా ఊహించని మలుపులు తిరిగింది. అది చిలికి చిలికి గాలివానలా మారి చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరడమే కాకుండా, హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనంగా మారింది. అసలు ఈ వివాదం జూన్ 28న కొండాపూర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీలో ప్రారంభమైంది. అక్కడ నివసిస్తున్న హీరో అఖిల్‌ రాజ్‌ ఇంటికి రమేశ్ అనే ఫుడ్‌ డెలివరీ బాయ్‌ ఒక నాన్-వెజ్ ఫుడ్ పార్సిల్‌ను తీసుకువచ్చాడు. నిజానికి ఆ పార్సిల్ ఎదురుగా ఉన్న మరో అపార్ట్‌మెంట్‌కు ఇవ్వాల్సింది కాగా, పొరపాటున అడ్రస్ కన్ఫ్యూజన్‌తో అఖిల్ రాజ్‌ నివాసంలో డెలివరీ చేశాడు.

తన పొరపాటును తెలుసుకున్న డెలివరీ బాయ్ రమేశ్ వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ, హీరో అఖిల్ రాజ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బిల్డింగ్ మెట్లపై నుంచి కిందకు వస్తున్న డెలివరీ బాయ్‌పైకి హీరో కోపంతో దూసుకెళ్లడం, కొట్టడానికి ప్రయత్నించడం వంటి తీవ్ర దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ గొడవ మొత్తాన్ని సదరు డెలివరీ బాయ్ తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. తాను సారీ చెప్పినా వినకుండా హీరో దౌర్జన్యానికి దిగాడని, అంతటితో ఆగకుండా హీరో తల్లి తన ముఖంపై ఉమ్మివేసి తీవ్రంగా అవమానించిందని రమేశ్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే డెలివరీ బాయ్ తన తల్లిని అవమానకరంగా మాట్లాడినందునే తాను ఒక కొడుకుగా తీవ్రంగా స్పందించానంటూ అఖిల్ రాజ్ కూడా వివరణ ఇస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హీరో అఖిల్ రాజ్ అదే రోజు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. సదరు డెలివరీ బాయ్ తనతో, తన కుటుంబంతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, పరువు నష్టం కలిగించే ఉద్దేశంతో వీడియోను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశాడని తన రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ పగ, ప్రతీకారాల వివాదం అంతటితో ముగిసిపోలేదు. మంగళవారం నాడు అఖిల్‌ రాజ్‌ తన తల్లిదండ్రులతో కలిసి కారులో ఒక గుడికి బయలుదేరారు. ఈ విషయాన్ని ముందే గమనించి కాపుగాసిన డెలివరీ బాయ్‌ రమేశ్‌, తన స్నేహితులతో కలిసి మార్గమధ్యంలో హీరో ప్రయాణిస్తున్న కారును ఒక్కసారిగా అడ్డుకున్నాడు.

అంతా కలిసి కారును చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కారులో ఉన్న అఖిల్ రాజ్ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురైంది. దీనిపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ బాలరాజ్ నేతృత్వంలోని పోలీస్ బృందం క్షణాల వ్యవధిలో ఘటనాస్థలానికి చేరుకుంది. దాడికి తెగబడిన ప్రధాన నిందితుడు రమేశ్‌తో పాటు అతనికి సహకరించిన స్నేహితుడు సందీప్, అలాగే మరో నలుగురిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు దాడి ఘటనపై గచ్చిబౌలి పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఒక చిన్న రాంగ్ అడ్రస్ డెలివరీ గొడవ చివరకు ఇంతటి హింసాత్మక దాడికి, ఆరుగురి అరెస్ట్‌కు దారితీయడం గమనార్హం.

?s=20

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com