
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (Lenin). రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రం జూలై 10న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తిరుపతి వేదికగా జరిగిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరో అఖిల్ అక్కినేని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు.
దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు ప్రేక్షకులకు, అభిమానులకు దూరంగా ఉండటంపై తన మనసులోని బాధను, ఆవేదనను ఈ వేదికపై అఖిల్ ఫ్రాంక్‌గా పంచుకున్నారు. ఇటీవల వైజాగ్ ఈవెంట్ స్టేజ్ మీద సారీ చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇవాళ కూడా అభిమానులకు క్షమాపణలు చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
గత రెండున్నర ఏళ్లుగా అభిమానులతో కమ్యూనికేట్ చేయలేకపోయానని, ముఖం చూపించలేకపోయాననే బాధ తన మైండ్‌లో ఎంతో బలంగా ఉండిపోయిందని అఖిల్ అన్నారు. కానీ ఇవాళ తను ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చానని, ఆ పాజిటివ్ ఎనర్జీనే ఈ 'లెనిన్' సినిమా అని స్పష్టం చేశారు.
ఈ సినిమాతో తాను కొత్తగా కనిపించాలని, ఎంతో బాగా నటనను ప్రదర్శించాలని కష్టపడినట్లు చెప్పారు. అయితే వీటన్నింటి వెనుక ఉన్న తన ఏకైక ఉద్దేశం ఒక్కటేనని.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు తనను తమ ఇంటి బిడ్డగా భావించి, గుండెల్లో దాచుకోవాలని అఖిల్ ఆకాంక్షించారు. "నన్ను మీ ఇంటి వాడిని చేసుకోండి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, అప్పుడే నేను ఎంతో సంతోషంగా ఉంటాను" అంటూ అఖిల్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల హృదయాలను కదిలించాయి.
రెండు సంవత్సరాల క్రితం రాయలసీమ బిడ్డ అయిన దర్శకుడు మురళీ కిషోర్ (నందు) తనను కలిసి ఈ అద్భుతమైన కథను చెప్పాడని అఖిల్ గుర్తుచేసుకున్నారు. కథ విన్న వెంటనే నందుకు ఒక గట్టి హగ్ ఇచ్చి, "ఈ కథను ఇంకెవరికీ చెప్పకు, ఇది నాకోసమే రాశావు" అని అడిగినట్లు చెప్పారు. ఆ సమయంలో తన మైండ్‌లో రన్ అవుతున్న పెయిన్ జర్నీ, బాధ అంతా ఆ కథలో కనిపించిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతటి గొప్ప దర్శకుడిని తనకు అందించినందుకు నందు తల్లిదండ్రులకు వేదికపై ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ నమ్మకానికి తాము తిరిగి ఇచ్చే థాంక్స్ ఏంటనేది జూలై 10న థియేటర్లలో 'లెనిన్' సినిమా రూపంలో చూపిస్తామని, అది చూసి అందరూ ఆనందిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమా ప్రయాణంలో నిర్మాత సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ తనకు అందించిన సపోర్ట్ మరువలేనిదని అఖిల్ కొనియాడారు. రెండేళ్ల క్రితం వంశీతో కలిసి పార్ట్‌నర్స్ లాగా వర్క్ చేద్దామని అనుకున్నామని, ఈ కథతో తమ మధ్య ఒక గొప్ప పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయిందని చెప్పారు. ఈ కథను తన తండ్రి నాగార్జున గారి వద్దకు తీసుకెళ్లినప్పుడు.. హిట్ కొట్టడం, బ్లాక్‌బస్టర్ కొట్టడం మాత్రమే కాకుండా ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమా ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఇద్దరూ చేతులు కలిపిన క్షణాలను అఖిల్ గుర్తుచేసుకున్నారు. ఈ జర్నీలో ఎడిటర్ నవీన్ నూలి, డీఓపీ లియాన్ బ్రిటోతో పాటు ఎంతో మంది టెక్నీషియన్లు ప్రాణం పెట్టి పనిచేశారని, అందుకే ఇవాళ తాను ఎంతో వర్క్ సాటిస్ఫాక్షన్‌తో, నమ్మకంతో స్టేజ్ మీద నిలబడగలిగానని హర్షం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman S) ఈ సినిమాకు అద్భుతమైన ప్రాణం పోశాడని అఖిల్ ప్రశంసించారు. గత రెండు మూడు రోజులుగా సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) చూస్తున్నామని, థమన్ మ్యూజిక్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని అన్నారు. అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ (భారతి) పాత్ర కోసం పడిన కష్టాన్ని తాను కళ్లారా చూశానని, ఆమె షాట్‌లో చూపిస్తున్న ఎనర్జీ చూసి తాము కూడా ఎంతో జాగ్రత్తగా, వళ్లు దగ్గర పెట్టుకుని యాక్ట్ చేయాల్సి వచ్చిందని నవ్వుతూ చెప్పారు. సహనటులు శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ ఒక కుటుంబంలా కలిసి కష్టపడ్డారని, వారంతా తన గురించి మాట్లాడిన మంచి మాటలన్నీ ఈ సినిమా ఇచ్చిన గొప్పదనమేనని పేర్కొన్నారు.
చివరగా తన తండ్రి నాగార్జున గారి వైపు చూస్తూ.. "నాన్నా.. ఇవాళ నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. ఈసారి జూలై 10న సినిమానే మాట్లాడుతుంది. థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వచ్చే రియాక్షనే మన కష్టానికి సమాధానం చెబుతుంది. అప్పుడే నేను మళ్లీ మాట్లాడతాను" అంటూ అఖిల్ తన స్పీచ్‌ను ముగించారు.
Akhil Akkineni, Lenin Event, Tirupati, TeluguOne






