
సంగీత ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు, సంగీత దర్శకుడు ఆదిత్య రామ్ శంకర్. ఆదిత్య రామ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని మోసం చేశాడంటూ ఒక మహిళ చేసిన సంచలన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు ముంబైలోని ప్రముఖ జుహూ పోలీస్ స్టేషన్‌లో సదరు గాయకుడిపై FIR నమోదైంది. చట్టప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించే పెళ్లి ఉద్దేశం లేకుండా శారీరక సంబంధం పెట్టుకోవడం అనే అంశంపై పోలీసులు నూతన చట్టాల పరిధిలోని సెక్షన్ 69 కింద కేసు నమోదు చేసి దర్యాప్తుని ప్రారంభించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది క్రితం కామన్ ఫ్రెండ్ ద్వారా ఆదిత్య రామ్ శంకర్‌తో సదరు మహిళకి మొదటిసారి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్దిరోజుల్లోనే విడదీయరాని స్నేహంగా మారింది. ఆపై తామిద్దరం జీవితాంతం కలిసి ఉందామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ఆదిత్య ఆమెకి నమ్మకం కలిగించాడు. ఈ క్రమంలోనే ముంబైలోని జుహూలో ఉన్న ఒక హోటల్‌కి తీసుకువెళ్లి మొదటిసారి శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
Also read: Dharman: ధర్మన్ వెనుక అసలు కథ ఇదే
ఆ తర్వాత కూడా వారి మధ్య బంధం కొనసాగిందని, ప్రతిసారీ పెళ్లి ప్రస్తావనని ముడిపెడుతూనే సుదీర్ఘ కాలంగా లొంగదీసుకున్నాడని, అయితే పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని గట్టిగా అడిగిన ప్రతిసారీ తన నుంచి స్పష్టమైన సమాధానం రాకపోగా, ఏదో ఒక నెపం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. చివరకు అతని ప్రవర్తనలో మార్పుని గమనించిన సదరు మహిళ, తాను మోసపోయానని గ్రహించి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. ముంబై పోలీసులు ప్రస్తుతం హోటల్ రికార్డులను, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలను నిశితంగా పరిశీలిస్తున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక సెలబ్రిటీపై ఇలాంటి ఆరోపణలు రావడం, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది.






