టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ప్రస్తుత చిత్ర పరిశ్రమ తీరుపై, అలాగే సెన్సార్ బోర్డు వ్యవహార శైలిపై ఘాటుగా స్పందించారు. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల కంటెంట్, వాటి వల్ల సమాజంపై పడుతున్న ప్రతికూల ప్రభావం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా చిత్రాలను తెరకెక్కిస్తున్న మేకర్స్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు.
సినిమా అంటే ఒకప్పుడు కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి హాయిగా ఆస్వాదించే వాతావరణం ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సుమన్ ఆవేదన చెందారు. ఇంట్లోని సభ్యులు విడివిడిగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాల్సిన దుస్థితి దాపురించిందని, అలాంటి అసభ్యకర, హింసాత్మక కంటెంట్‌ను థియేటర్లలోకి అనుమతిస్తున్న సెన్సార్ బోర్డు అసలు ఏం చేస్తోందో అర్థం కావడం లేదని నిలదీశారు.
ఇప్పటికే చిన్నారులు, యువత చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు చేరి, సోషల్ మీడియా ప్రభావంతో దారి తప్పుతున్నారని సుమన్ గుర్తుచేశారు. ఇలాంటి సున్నితమైన సమయంలో సినిమాల ద్వారా మరింత వికృతమైన ఆలోచనలను ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల పేరుతో కొంతమంది సమాజాన్ని నాశనం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
సినిమా అనేది సమాజంలో ఎంతోమందిని ప్రభావితం చేయగల అత్యంత శక్తివంతమైన సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను మార్చే సామర్థ్యం వెండితెరకు ఉందన్నారు. మంచి వేల్యూస్, సమాజానికి మేలు చేసే సందేశాలు, మానవ అనుబంధాలను పెంపొందించే కథలతో సినిమాలు తీస్తే సమాజంలో ఎంతో మంచి మార్పు తీసుకురావచ్చని తెలిపారు.
కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు, వ్యాపార దృక్పథమే ధ్యేయంగా కాకుండా, సామాజిక బాధ్యతతో కథలను ఎంచుకోవాలని దర్శకనిర్మాతలకు సుమన్ విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో అయినా సెన్సార్ బోర్డు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి, మంచి చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని ఆయన ఆకాంక్షించారు.
[Actor Suman, Censor Board, Current Telugu Movies, Suman Sensational Comments, Tollywood News Updates]




