
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్‌తో, వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi). ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన 'ఆది' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆయన, పరిశ్రమలో 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, తన వ్యక్తిగత విషయాలను తెలుగువన్(TeluguOne) ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడుతూ తన తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. 'ఆది' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన తమాషా సంఘటనలను వివరిస్తూ, ఎన్టీఆర్(NTR)తో ఉన్న అనుబంధం అప్పటి నుంచే బలపడిందని చెప్పారు. హీరో అనే ఫీలింగ్ లేకుండా నా లాంటి వాడిని దగ్గరకు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. అదుర్స్ సినిమా తన కెరీర్ ను టర్న్ చేసిందని, ఆ తర్వాత సినిమాలు క్యూ కట్టాయని తెలిపారు. అదుర్స్ సినిమా తర్వాతనే సాఫ్ట్‌వేర్ జాబ్ వదిలేశానని పేర్కొన్నారు. ఆ సినిమా విడుదలైన మరుసటి రోజే ఏకంగా 20 సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటే తన పాత్ర ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక రాజకీయాల గురించి స్పందిస్తూ రఘు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారు తన క్లాస్‌మేట్ అని, తాము ఒకే బెంచ్ మీద కూర్చునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. తన జాతకం ప్రకారం భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్కులు చెప్పిన విషయాన్ని కూడా బయటపెట్టారు. తనకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమని, సమయం వచ్చినప్పుడు పార్టీ కోసం ప్రచారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తన మనసులోని మాటను వెల్లడించారు.
తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడంపై స్పందిస్తూ.. ఇక్కడ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదని, కానీ తనకంటూ ఒక టైం రావాలని అన్నారు. ఎన్టీఆర్ గారి మనసులో ఏముందో తెలియదని, కానీ ఆయన సీఎం కావాలని అందరిలా తాను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పారు. అలాగే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమాలో తాను నటించే అవకాశం ఉందని, ఇప్పటికే ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయని ఒక గుడ్ న్యూస్ చెప్పారు.
తన 25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశానని, ఇకపై రొటీన్ క్యారెక్టర్లు కాకుండా ఎమోషనల్, సెంటిమెంటల్ పాత్రలు చేయాలని ఉందని రఘు తన కోరికను వ్యక్తపరిచారు. విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను సిద్ధమేనని, తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నానని అన్నారు. ఈ ఇంటర్వ్యూలో రఘు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూల కోసం తెలుగువన్ (TeluguOne) యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.






