.jpg)
థియేటర్లలో విడుదల కాలేని సినిమాలకు ఓటీటీ ఒక వరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. చిన్న, మధ్య స్థాయి బడ్జెట్‌లతో తయారైన కొన్ని సినిమాలు కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డాయి. అలాంటి వాటికి ఓటీటీ అయాచిత వరంలా కలిసి వచ్చింది. మంచి ఆఫర్లు వస్తుండటంతో నిర్మాతలు కూడా తమ సినిమాల్ని స్ట్రీమింగ్ సైట్లకు అమ్మేస్తున్నారు. లేటెస్ట్‌గా కీర్తి సురేశ్ సినిమా 'పెంగ్విన్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ మూవీ 'అమృతారామమ్' నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పుడు గోపీచంద్ సినిమా ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమవుతోందని సమాచారం.
అయితే ఆ సినిమా ఇప్పుడు షూటింగ్ జరుపుకున్నది కాదు. మూడేళ్ల క్రితం గోపీచంద్, నయనతార జంటగా సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ 'ఆరడుగుల బుల్లెట్' మూవీని రూపొందించారు. షూటింగ్ పూర్తయినా కూడా, ఆర్థిక సమస్యలతో ఆ సినిమా విడుదల ఆగిపోయింది. ఇక అది ఎన్నటికీ వెలుగుచూడదని అనుకుంటున్న తరుణంలో ఓటీటీకి ఆ మూవీని అమ్మాలని ఆ చిత్ర నిర్మాత తాండ్ర రమేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. గోపీచంద్ వంటి యాక్షన్ హీరో నటించడం, నయనతార సూపర్‌స్టార్ హీరోయిన్‌గా చేయడంతో ఓటీటీలో 'ఆరడుగుల బుల్లెట్'కు మంచి రేటు వస్తుందనే ఆశాభావంతో నిర్మాత ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.






