Home

»

Latest News

'భీమ్లా నాయ‌క్' ఈవెంట్‌లో త్రివిక్ర‌మ్ స్టేజ్ వెన‌కే ఉండిపోయారెందుకు?

Feb 24, 2022

 

ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా 'భీమ్లా నాయ‌క్' రేపు అత్య‌ధిక థియేట‌ర్ల‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతుండ‌టంతో అంద‌రి దృష్టీ ఆ సినిమాపైనే ఉంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఎటు చూసినా 'భీమ్లా నాయ‌క్' మేనియా కనిపిస్తోంది. తెలంగాణ‌లో ఆ సినిమాకు ప్ర‌భుత్వం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తుంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పూర్తి విరుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. అద‌న‌పు షో వేసినా, టికెట్ ధ‌ర‌లు పెంచినా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు అధికారులు తాఖీదులు పంపారు. 

ఈ విష‌యం అలా ఉంచితే, బుధ‌వారం రాత్రి జ‌రిగిన 'భీమ్లా నాయ‌క్' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ అస‌లు మాట్లాడ‌క‌పోవ‌డం, స్టేజి వెనుక ఉండ‌టానికే ప్రాధాన్యం ఇవ్వ‌డం, ఈవెంట్ చివ‌ర‌లో స్టేజిపైకి వ‌చ్చినా, వెనుక వ‌రుస‌లో నిల్చోవ‌డం.. చాలా మంది దృష్టిని ఆక‌ర్షించింది. ఆయ‌న ఎందుక‌లా వెనుక ఉండిపోయార‌ని చాలా మంది ఆరాలు తీశారు. భీమ్లా నాయ‌క్ సినిమాకి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌కుడైనా, అస‌లు ఆ ప్రాజెక్టును సెట్ చేసింది త్రివిక్ర‌మ్ అనేది నిజం. మ‌ల‌యాళం హిట్ సినిమా 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్' రైట్స్ తీసుకున్న ద‌గ్గ‌ర్నుంచీ ఆ సినిమాకు ప‌నిచేసే యాక్ట‌ర్లు, టెక్నీషియ‌న్ల‌ను ఎంపిక చేయ‌డం వ‌ర‌కు త్రివిక్ర‌మ్ ప్ర‌ధాన పాత్ర వ‌హించారు.

అంతేనా.. 'భీమ్లా నాయ‌క్‌'కు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను స‌మ‌కూర్చారు. ఆయ‌న ఇచ్చిన స్క్రిప్టును య‌థాత‌ధంగా తెర‌పైకి తీసుకువ‌చ్చాడు సాగ‌ర్ చంద్ర‌. సెట్స్‌పై డైరెక్ట‌ర్ ప‌ని విష‌యంలో త్రివిక్ర‌మ్ ఎప్పుడూ జోక్యం చేసుకోలేద‌ని యూనిట్ స‌భ్యులు చెప్తున్న మాట‌. ఆఖ‌రుకి 'భీమ్లా నాయ‌క్' ఈవెంట్‌కు కేటీఆర్‌ను చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానించ‌డానికి ఆయ‌న ద‌గ్గ‌ర‌కు నిర్మాత రాధాకృష్ణ‌ను తీసుకువెళ్లింది కూడా త్రివిక్ర‌మ్ కావ‌డం గ‌మ‌నార్హం. ఇలా ఆ సినిమాకు సంబంధించి తెర‌వెనుక చాలా ప‌నులే చేశారు త్రివిక్ర‌మ్‌.

ఇంత చేసిన ఆయ‌న‌, ప్రి రిలీజ్ ఈవెంట్‌లోనూ తెర‌వెనుకే ఎందుకు ఉండిపోయారు? ఆ సినిమాకు ప‌నిచేసిన మెయిన్ టెక్నీషియ‌న్ల‌లో ఒక‌రిగా ఆయ‌న స్టేజ్ మీద ఉండొచ్చు, స్పీచ్ ఇవ్వ‌వ‌చ్చు. అయినా ఆయ‌న ఆ ప‌ని చేయ‌లేదు. ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించ‌డానికి కార‌ణ‌మేంటి? అనే ప్ర‌శ్న వేసుకుంటే, ఇటీవ‌ల ఆయ‌న‌ను ఉద్దేశించి న‌టుడు-నిర్మాత బండ్ల గ‌ణేశ్ మాట్లాడిన‌ట్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆడియో లీక్ గుర్తుకు రాక మాన‌దు. ఆ ఆడియో త‌న‌ది కాద‌నీ, ఎవ‌రో త‌న పేరిట దాన్ని చ‌లామ‌ణిలోకి తెచ్చార‌నీ గ‌ణేశ్ ఖండించినా, అది ఆయ‌న వాయిస్సేన‌ని చాలామంది న‌మ్ముతున్నారు.

లీకైన ఆడియోలో, "బండ్లన్నా భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్తున్నావా?" అని ఫ్యాన్ అడగగా.. "ఆ వెళ్తున్నాను" అని మొదట బండ్ల సమాధానం చెప్పాడు. ఆ తర్వాత 'స్పీచ్ రెడీ చేసుకున్నావా?' అని మళ్ళీ ఫ్యాన్ అడగగా.. "స్పీచ్ అయితే రెడీ చేశాను కానీ వాళ్ళు ఇంకా పిలవలేదమ్మా.. త్రివిక్రమ్ గాడు రావొద్దు అన్నాడంట, వాడు డౌన్ అవుతాడని. అదే ఆలోచిస్తున్నాను. నాకేమో వెళ్ళాలని ఉంది. మంచి డైలాగ్స్ కూడా రాసుకున్నాను అద్భుతంగా." అని బదులిచ్చాడు.

"పిలవకపోయినా వెళ్ళిపో అన్నా" అని ఫ్యాన్ అనడంతో.. "అలా వెళ్తే బాగోదమ్మా. త్రివిక్రమ్ వైసీపీ వాళ్ళతో పెద్ద ప్లాన్ చేసుకున్నాడు అదీ బాధ" అని బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశాడు. "నిన్ను చాలా మిస్ అవుతాం అన్నా" అని ఫ్యాన్ అనడంతో.. "అందరూ గట్టిగా అరవండి. నేను అక్కడే ఉంటాను. బండ్లన్న రావాలి బండ్లన్న రావాలి అని గట్టిగా అరవండి నేను వెంటనే వచ్చేస్తాను" బండ్ల చెప్పినట్లుగా ఆడియోలో ఉంది. త్రివిక్రమ్ పై బండ్ల చేసిన సంచలన వ్యాఖ్యల ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. 

ఈ ఆడియో విష‌యంలో త్రివిక్ర‌మ్ బాధ‌ప‌డ్డార‌నీ, అందుకే 'భీమ్లా నాయ‌క్' ఈవెంట్‌లో స్టేజ్ మీద‌కు రాకుండా, స్టేజ్ వెనుకే ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నార‌నీ ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే ఆయ‌న స్టేజ్ మీద‌కు రాక‌పోయినా, త్రివిక్ర‌మ్ లేక‌పోతే 'భీమ్లా నాయ‌క్' ప్రాజెక్టే ఉండేది కాద‌ని ఇటు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, అటు సాగ‌ర్ చంద్ర చెప్ప‌డంతో ఆయ‌న విలువ పెరిగిందే కానీ, త‌గ్గ‌లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com