Home

»

Latest News

‘వారణాసి’ వాయిదా పడుతుందా?.. క్లారిటీ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్.!

Oct 29, 2026 6:38PM

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా పడుతుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు.

‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్‌కు ‘వారణాసి’ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. వారణాసి వాయిదా వార్తలకు చెక్ పెట్టారు. నిర్మాతలు ఇప్పటికే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారని గుర్తు చేశారు. ‘వారణాసి’ 2027 ఏప్రిల్ 7న తప్పకుండా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. విడుదల తేదీలో మార్పు లేదా అని మరోసారి అడగ్గా.. అవును, కచ్చితంగా అదే రోజున విడుదలవుతుందని కన్ఫర్మ్ చేశారు.

రాజమౌళి సినిమా అంటేనే విజువల్స్, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు ‘వారణాసి’ని అంతకుమించిన స్థాయిలో రూపొందిస్తున్నారనే అంచనాలు ఉన్నాయి.

ఇలాంటి భారీ సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయడానికి ఎక్కువ సమయం అవసరమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదా పడుతుందనే ప్రచారం మొదలైంది. అయితే విజయేంద్ర ప్రసాద్ తాజా వ్యాఖ్యలతో ఈ అనుమానాలకు సమాధానం లభించినట్లయింది.

‘వారణాసి’లో మహేశ్ బాబు రుద్ర పాత్రలో కనిపించనున్నారు. శ్రీరాముడిగానూ కనువిందు చేయనున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలు, పురాణ అంశాలు, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.

ఇది కూడా చదవండి: రామాయణ రిలీజ్.. పాకిస్థాన్‌లో రియాక్షన్ ఎలా ఉందంటే.?

 

 

 

[Varanasi Postponement Rumours, Varanasi Release Date, Vijayendra Prasad, Varanasi Movie, Mahesh Babu, SS Rajamouli, Priyanka Chopra, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com