Home

»

Latest News

వినాయక్ షాకింగ్ ఫ్లాష్‌బ్యాక్.. వడ్డే నవీన్ వల్లే ఎన్టీఆర్ 'ఆది' సినిమా సాధ్యమైందా?

Jun 13, 2026 9:13AM

టాలీవుడ్ లో సంచలన రికార్డులను సృష్టించి, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)ను తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం 'ఆది' (Aadi). డైరెక్టర్ వి.వి.వినాయక్ (VV Vinayak) తొలి అడుగులోనే టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. కో-డైరెక్టర్ స్థాయి నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ మెచ్చే రేంజ్ టాప్ డైరెక్టర్‌గా వినాయక్ మారడం వెనుక హీరో వడ్డే నవీన్ (Vadde Naveen) మరియు ఒక విదేశీ ప్రయాణం ముడిపడి ఉన్నాయి. 

తాజాగా జరిగిన 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన వినాయక్, వడ్డే నవీన్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను మరియు నాటి మధుర జ్ఞాపకాలను అభిమానులతో పంచుకున్నారు.

తాను కో-డైరెక్టర్‌గా పనిచేసిన చివరి చిత్రం వడ్డే నవీన్ గారిదేనని వినాయక్ గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే తనకు మొదటి చిత్రం 'ఆది' చేసే అవకాశం వచ్చిందని చెప్పారు. స్విట్జర్లాండ్‌లో నవీన్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే తనకు జూనియర్ ఎన్టీఆర్ పరిచయమయ్యారని, ఆ రకంగా తన కెరీర్ మలుపు తిరగడానికి నవీన్ సినిమాయే నాంది పలికిందని వినాయక్ వెల్లడించారు. నవీన్ తనను ఎంతో ప్రేమగా, ఆదరంగా చూసుకునేవారని కొనియాడారు.

నవీన్ తన కెరీర్‌లో చేసిన సినిమాల్లో 90 శాతానికి పైగా సినిమాలు ఆయనకు పూర్తిగా నచ్చి చేసినవి కాకపోవచ్చని వినాయక్ అభిప్రాయపడ్డారు. ఆయన పెరిగిన వాతావరణం, ఆయనకున్న సినిమా పరిజ్ఞానం చాలా గొప్పవని, అప్పట్లో సెట్స్‌లో ఏదైనా సీన్ సరిగ్గా రానప్పుడు నవీన్ చాలా మదనపడేవారని గుర్తుచేశారు. ఒకరోజు తాను రాసిన సీన్ నచ్చి, మధ్యాహ్నం భోజనానికి పిలిచి.. "వినయ్ నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు, అసిస్టెంట్‌గా పనిచేయడం ఆపేసి డైరెక్టర్‌గా ప్రయత్నించు" అని నవీన్ ధైర్యాన్నిచ్చారని వినాయక్ తెలిపారు.

అప్పట్లో వడ్డే నవీన్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, వారికున్న ఇన్‌ఫ్లుయెన్స్ ఎలాంటిదో వివరిస్తూ ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. స్విట్జర్లాండ్ నుంచి వస్తున్నప్పుడు ఫ్లైట్ టాయిలెట్‌లో ఒక కాస్ట్యూమర్ సిగరెట్ కాల్చడంతో ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఏకే-47 గన్స్‌తో వచ్చి అతడిని అరెస్ట్ చేశారట. ఆ సమయంలో వడ్డే నవీన్ చెన్నై నుంచి ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో ఆ సమస్యను పరిష్కరించి అతడిని బయటకు తీసుకువచ్చారని, వారి పవర్ చూసి తాను ఆశ్చర్యపోయానని వినాయక్ చెప్పారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com