Home

»

Latest News

క‌త్తి మ‌హేశ్ వైద్యానికి రూ. 17 ల‌క్ష‌లు మంజూరు చేసిన ఏపీ ప్ర‌భుత్వం!

Jul 2, 2021 4:49PM

 

సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు క‌త్తి మ‌హేశ్ వైద్యానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రూ. 17 ల‌క్ష‌లు మంజూరు చేసింది. ఇటీవ‌ల త‌న స్వ‌స్థ‌లం చిత్తూరు నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తూ తెల్ల‌వారుజామున నెల్లూరు స‌మీపంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మ‌హేశ్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్రాథ‌మికంగా ఆయ‌న‌కు నెల్లూరు మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌లో చికిత్స అందించి, మ‌రింత మెరుగైన వైద్యం కోసం చెన్నై అపోలో హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. మ‌హేశ్ త‌ల‌కు, కంటికి, ముక్కుకు బ‌ల‌మైన గాయాలు త‌గిలిన‌ట్లుగా వైద్యులు గుర్తించారు. మెద‌డులో ర‌క్త‌స్రావం కాక‌పోవ‌డంతో ఆయ‌న‌కు ప్రాణాపాయం త‌ప్పింది. ముక్కు ఎముక విర‌గ‌గా, దెబ్బ‌తిన్న ఎడ‌మ‌కంటికి స‌ర్జ‌రీ నిర్వ‌హించారు.

ఈ నేప‌థ్యంలో క‌త్తి మ‌హేశ్ వైద్య ఖ‌ర్చుల నిమిత్తం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి (సీఎంఆర్ఎఫ్‌) నుంచి రూ. 17 ల‌క్ష‌లు మంజూరు చేశారు. ఈ మేర‌కు అపోలో హాస్పిట‌ల్‌కు ఓ లెట‌ర్ జారీ చేశారు. క‌త్తి మ‌హేశ్‌కు అవ‌స‌ర‌మైన సంపూర్ణ వైద్య చికిత్స అందించాల‌నీ, చికిత్స పూర్త‌యి డిశ్చార్జ్ చేసిన 90 రోజుల్లోగా ఒరిజిన‌ల్ బిల్స్‌ను అంద‌జేయాల‌నీ, వాటిని ప‌రిశీలించి వైద్య ఖ‌ర్చుల‌కు అయిన మొత్తం సొమ్మును విడుద‌ల చేస్తామ‌నీ ఆ లేఖ‌లో వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి ద‌గ్గ‌ర స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ ఎం. హ‌రికృష్ణ పేరిట ఈ లేఖ జారీ అయ్యింది.

ప్ర‌స్తుతం క‌త్తి మ‌హేశ్ కోలుకుంటున్నారు. క‌నీసం మ‌రో ప‌ది రోజులైనా హాస్పిట‌ల్‌లో ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com