ENE 2: 'ఈ నగరానికి ఏమైంది-2' మెయిన్ యాక్టర్ ఎందుకు మారాడు.. అసలు నిజమిదే!
on Jan 22, 2026

వార్తల్లో 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్
కార్తీక్ పాత్రలో సుశాంత్ రెడ్డికి బదులుగా శ్రీనాథ్ మాగంటి!
మెయిన్ యాక్టర్ ని ఎందుకు మార్చారు?
సుశాంత్ రెడ్డి తప్పుకున్నాడా? తప్పించారా?
ఈ తరం తెలుగు యువత రిపీటెడ్ గా చూసే సినిమాలలో ఒకటి 'ఈ నగరానికి ఏమైంది'. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించారు. 2018 లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఈ నగరానికి ఏమైంది-2' రూపొందుతోంది. (Ee Nagaraniki Emaindi 2)
ఒక సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతుందంటే.. మొదటి భాగంలోని ప్రధాన తారాగణమే రెండో భాగంలో కూడా కొనసాగుతుంది. అయితే 'ఈ నగరానికి ఏమైంది-2'లో మాత్రం సాయి సుశాంత్ రెడ్డికి బదులుగా శ్రీనాథ్ మాగంటి నటిస్తున్నాడు. దీంతో అలా ఆర్టిస్ట్ ని మార్చడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
'ఈ నగరానికి ఏమైంది' గ్యాంగ్ గా ఆ నలుగురు ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అయ్యారు. అందుకే వారిలో ఒకరిని రీప్లేస్ చేయడంపై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొత్త ఆర్టిస్ట్ వస్తే ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటుడు సాయి సుశాంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు.

"వ్యక్తిగత కారణాల వల్ల 'ఈ నగరానికి ఏమైంది-2'లో నటించలేనని సుశాంత్ చెప్పినప్పుడు బాధ కలిగింది. అయితే ఈ స్క్రిప్ట్ మీద, ఈ క్యారెక్టర్స్ మీద నాకు నమ్మకం ఉంది. 'ఈ నగరానికి ఏమైంది' ప్రపంచం అనేది నిజ జీవితంలో నా ఫ్రెండ్స్ తో అనుభవాల నుంచి పుట్టింది. 'ఈ నగరానికి ఏమైంది-2' స్టోరీ కూడా ఆర్గానిక్ గా వచ్చిందే. ఇందులో సుశాంత్ లేనప్పటికీ కార్తీక్ పాత్ర మిమ్మల్ని మునుపటిలాగానే అలరిస్తుంది." అని తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు.

"ఈ నగరానికి ఏమైంది నా హృదయానికి దగ్గరైన సినిమా. నాకెన్నో జ్ఞాపకాలను ఇచ్చింది. ఆ సినిమా చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇప్పుడు లైఫ్ చాలా మారిపోయింది. నా ప్రజెంట్ వర్క్ తో సినిమాని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారింది. అందుకే మనసుకి బాధగా ఉన్నా ఈ నగరానికి ఏమైంది-2 చేయలేకపోతున్నాను." అని సుశాంత్ తెలిపాడు.
మరి 'ఈ నగరానికి ఏమైంది-2' ఎలా ఉంటుంది? కార్తీక్ పాత్రలో సుశాంత్ రెడ్డిని మరిపించేలా శ్రీనాథ్ మాగంటి నటిస్తాడా? అనేది చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



