
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ 'రాధేశ్యామ్'. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. ఈ నెల 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ సందర్భంగా ఈ మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో కలిసి రాధాకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు.
సినిమా అవుట్ పుట్ చూసి ప్రభాస్, తాము సంతృప్తి చెందామని రాధాకృష్ణ తెలిపాడు. ఇప్పుడు ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ పట్ల తాము చాలా హ్యాపీగా ఉన్నామని అన్నాడు. కొన్ని కొన్ని సీన్స్ ని ఆడియన్స్ ఎమోషనల్ అవుతున్నారని తెలిపాడు. మొదటిరోజే 79 కోట్ల షేర్ కలెక్ట్ చేయడం సంతోషంగా ఉందన్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక ఒక చెయ్యి లేని అమ్మాయి ఫోన్ చేసి.. 'చెయ్యి లేని వారికి కూడా ఫ్యూచర్ ఉంటుందని సినిమాలో చూపించారు థాంక్స్ అన్నా' అని చెప్పింది. ఆ ఒక్క మాట చాలు సినిమా జనాల్లోకి ఎంతలా వెళ్లిందో చెప్పడానికి అని రాధాకృష్ణ అన్నాడు.
తమన్ మాట్లాడుతూ.. రాధాకృష్ణ, మేము సినిమా పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని, మొదట వేరేలా టాక్ వచ్చిందని కానీ వెంటనే పాజిటివ్ టాక్ మారిపోయిందని అన్నాడు. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తన ఇమేజ్ కి భిన్నంగా లవ్ స్టొరీ చేయడం గ్రేట్ అని కొనియాడాడు. అప్పుడు 'సాహో'లో లవ్ లేదన్నారు, ఇప్పుడు 'రాధేశ్యామ్'లో యాక్షన్ లేదంటున్నారు. లవ్ స్టొరీలో యాక్షన్ సీన్స్ ఆశించడం కరెక్ట్ కాదని అన్నాడు. సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుందని, మేకింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉందని అంటున్నారు అని చెప్పాడు. ఈమధ్య అందరూ క్రిటిక్స్ అయిపోయారని, కొందరు స్లో అని కామెంట్స్ చేస్తున్నారని, అసలు స్లో అంటే ఏంటి? క్రిటిక్స్ కి కాలేజ్ ఏమైనా ఉందా? అలాంటి వాళ్ళు సినిమా ఎలా తీయాలో వచ్చి నేర్పించండి అంటూ తమన్ ఎద్దేవా చేశాడు.






