Home

»

Latest News

Prabhas: బాహుబలి తర్వాత స్పిరిట్.. ప్రాణం పెట్టేస్తున్న ప్రభాస్!

Jun 12, 2026 1:17PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్ అనగానే ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ కోసం ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో సిద్ధమయ్యాడు. వీరిద్దరి కలయికలో రాబోతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్' (Spirit) మూవీపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ మరియు యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ మార్క్ రా అండ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్‌కు ప్రభాస్ కటౌట్ తోడైతే థియేటర్లలో ఏ రేంజ్ విధ్వంసం ఉంటుందో ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి.

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, పూర్తి ఫోకస్ పెట్టి చేస్తున్న సినిమాగా 'స్పిరిట్' నిలిచింది. సాధారణంగా బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ ఎక్కువగా ఇండోర్ సెట్స్‌లోనే షూటింగ్ జరుపుకున్నాయి. కానీ ఈ సినిమా విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సరికొత్త పంథాను అనుసరిస్తున్నాడు. సినిమాకు సహజత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో 'స్పిరిట్' మూవీని రియల్ లొకేషన్స్‌లోనే షూటింగ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అందుకు తగ్గట్టుగానే ప్రభాస్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, పూర్తి డెడికేషన్‌తో రియల్ లొకేషన్స్ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా లేటెస్ట్ షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.

తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో 'స్పిరిట్' కొత్త షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ప్రభాస్ ఈ షెడ్యూల్ షూటింగ్‌లో అడుగుపెట్టడంతో అక్కడి వాతావరణం అంతా ఒక రేంజ్‌లో హీటెక్కిపోయింది. ప్రస్తుతం ఈ లొకేషన్‌లో సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులను చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సందీప్ రెడ్డి వంగా ఎక్కడా తగ్గకుండా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కు సూట్ అయ్యేలా ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేశాడట. ప్రభాస్ కూడా ఈ యాక్షన్ సీన్స్ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యి, డ్యూటీలో ఉన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా రియల్ లొకేషన్స్‌లో అదరగొడుతున్నాడు.

'స్పిరిట్' చిత్రాన్ని 2027 మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభాస్ పోలీస్ డ్రెస్ వేసుకుని థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com