Home

»

Latest News

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డేల 'శ్రీశ్రీ'.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తున్న క్రేజీ కాంబినేషన్!

Jul 10, 2026 11:20AM

మలయాళ స్టార్ స్టార్ దుల్కర్ సల్మాన్ సరికొత్త ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ #DQ41 టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం రివీల్ చేసింది. ఈ చిత్రానికి ఎంతో ఆహ్లాదకరంగా 'శ్రీశ్రీ' (Sri Sri) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 

ఎస్‌ఎల్‌వి సినిమాస్ (SLV Cinemas) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సరికొత్త కథాంశంతో, ఎమోషనల్ అండ్ రొమాంటిక్ రైడ్‌లా సాగే ఈ సినిమాను నూతన దర్శకుడు రవి నెలకుడితి తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడం వల్ల ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ, వినోదం, గుండెలను హత్తుకునే భావోద్వేగాల కలబోతగా ఈ లవ్ స్టోరీ రూపుదిద్దుకుంటోంది. 

గతంలో విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందులో వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూశాక, వెండితెరపై ఈ జంట సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు విడుదలైన టైటిల్ పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.

ఈ చిత్రానికి "లవ్ విల్ స్పార్క్ అగైన్" (Love Will Spark Again) అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ను పెట్టారు. కోల్పోయిన ప్రేమను, జీవితంపై ఆశను మళ్లీ ఎలా వెతుక్కున్నారనే ఒక అందమైన కథాంశంతో ఈ సినిమా సాగనుందని ఈ ట్యాగ్‌లైన్ హింట్ ఇస్తోంది. 

ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఇందులో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఒక కాంపౌండ్ వాల్‌పై క్యాజువల్‌గా కూర్చొని నవ్వుకుంటూ ముచ్చటించుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్ లైట్ బ్లూ కలర్ షర్ట్, గ్రే కలర్ ట్రౌజర్స్ ధరించి, కళ్లద్దాలతో ఎంతో క్లాసిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. పూజా హెగ్డే లైట్ బ్లూ కలర్ సల్వార్ సూట్ వేసుకుని, దుల్కర్ వైపు ఎంతో అప్యాయంగా చూస్తూ నవ్వుతోంది. వారిద్దరూ వేసుకున్న దుస్తులను బట్టి చూస్తే కాలేజీ క్లాస్‌మేట్స్‌లా కనిపిస్తున్నారు. 

ఈ పోస్టర్ చూస్తుంటే పాత జ్ఞాపకాలు, అమాయకత్వంతో కూడిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథ మనకు గుర్తుకు రాక మానదు. ఎటువంటి హడావుడి లేకుండా ఎంతో ప్రశాంతంగా, మనసుకు హత్తుకునేలా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఒక పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేసింది.

ఈ చిత్రానికి అనయ్ ఓం గోస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. 'శ్రీశ్రీ' చిత్రం తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో థియేటర్లలో విడుదల కానుంది.

 

Dulquer Salmaan, Pooja Hegde, Sri Sri Movie, First Look, DQ41

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com