Home

»

Latest News

పెళ్లి రోజు గిఫ్ట్‌గా విడాకుల నోటీసులు.. మంచు విష్ణు హీరోయిన్ కన్నీటి గాథ.!

Jul 5, 2026 4:28PM

బాలీవుడ్ ప్రముఖ నటి సెలీనా జైట్లీ తన వైవాహిక జీవితంలోని అత్యంత చీకటి కోణాన్ని బయటపెట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది. మంచు విష్ణు సరసన 'సూర్యం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అందాల తార, 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. అందరూ ఆమె జీవితం చాలా అందంగా సాగిపోతోందని అనుకున్నారు, కానీ ఆమె అంతరంగంలో ఒక పెద్ద పీడకలను అనుభవించింది. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ సినీ పరిశ్రమలోకి రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో, ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న నరకాన్ని గుర్తుచేసుకుని ఒక ఇంటర్వ్యూలో కన్నీరు పెట్టుకుంది.

తన 15వ వెడ్డింగ్ యానివర్సరీకి కొన్ని రోజుల ముందు జరిగిన ఒక దారుణమైన సంఘటనను సెలీనా గుర్తుచేసుకుంది. ఒకరోజు ఆమె భర్త పీటర్ హాగ్ ఆమెను కొండ కింద రోడ్డుపైనే కార్లో నుంచి దించేసి వెళ్ళిపోయాడు. సెలీనా నడుచుకుంటూ కొండపై ఉన్న తన ఇంటికి చేరుకునే సరికి, ఆమె కవల పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆస్ట్రియా మునిసిపాలిటీ లేదా రెసిడెన్స్ స్టేటస్‌కి సంబంధించిన ఏదో లేఖ వచ్చిందని ఆమె భావించింది. దాన్ని అనువదించి చదివే ఓపిక లేక, తన కవల పిల్లల చేతికి ఇచ్చి చదవమని చెప్పింది. కానీ ఆ లేఖలో ఉన్నది పెళ్లి రోజు బహుమతి నెపంతో పంపిన విడాకుల నోటీసు అని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. తన చిన్న పిల్లల నోటి నుంచే ఆ ఘోరమైన విడాకుల నోటీసును వినాల్సి రావడం ఆమె జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గాయంగా మిగిలిపోయింది. ఆ నోటీసులో ఆమెపై ఎన్నో అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ, పెళ్లి బంధం పూర్తిగా విచ్ఛిన్నమైందని పేర్కొన్నారు.

కోర్టు మొదటి విచారణ తర్వాత, నవంబర్ వరకు ఇద్దరూ సామరస్యంగా విడిపోయేందుకు ప్రయత్నించాలని జడ్జి సూచించారు. ఆ సమయంలో సెలీనా బ్యాంక్ ఖాతాలో చాలా తక్కువ డబ్బు ఉంది. భర్త మానసికంగా, ఆర్థికంగా తీవ్రంగా వేధిస్తున్న ఆ రోజులు ఆమెకు ఒక నరకంలా అనిపించాయి. అయినా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆమె స్నేహపూర్వకంగానే విడిపోవడానికి అంగీకరించింది. తనకు భర్త ఆస్తి వద్దు, కేవలం తాను కష్టపడి సంపాదించి పెట్టుబడిగా పెట్టిన డబ్బు, తన సొంత ఆస్తులు వెనక్కి ఇస్తే చాలని, పిల్లల ఉమ్మడి సంరక్షణ బాధ్యత ఇస్తే చాలని కోరింది.

కానీ ఆస్ట్రియాలోని ఆ ఇంట్లో భర్త పై అంతస్తులో ఉంటే, సెలీనా పిల్లలతో కలిసి మధ్య అంతస్తులో చాలా కాలం ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చింది. పిల్లల కోసం అక్కడే ఉండాలంటే ఉద్యోగం చేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడు. అంతటితో ఆగకుండా "నీకు సూపర్ మార్కెట్‌లో క్లీనర్ ఉద్యోగం ఇప్పిస్తాను" అంటూ అవమానించాడు. ఏ ఉద్యోగమూ తక్కువ కాదు కానీ, ఒక స్టార్ హీరోయిన్‌గా ఉన్న ఆమెను అలా అనడం వెనుక ఆమెను మానసికంగా దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉంది. ఇవన్నీ భరిస్తున్న సమయంలోనే, ఇండియాలో ఆమె కష్టపడి కొనుక్కున్న ఆస్తులను కూడా విక్రయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తనకు ఏమీ మిగల్చకుండా రోడ్డున పడేయాలని చూస్తున్నారని గ్రహించి, 2025 అక్టోబర్ 11న అర్ధరాత్రి 1 గంటకు ఆస్ట్రియా నుంచి పిల్లలను వదిలి ఒంటరిగా ఇండియాకు పారిపోయి వచ్చింది.

భారతదేశానికి వచ్చినప్పుడు ఆమెకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు. దాదాపు 10 రోజుల పాటు ఒక హోటల్‌లోనే గడపాల్సి వచ్చింది. ఆ తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందుల సమయంలో బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో పాటు మరికొందరు నమ్మకమైన స్నేహితులు అందించిన మద్దతుతోనే ఆమె మళ్లీ తన జీవితాన్ని సున్నా నుంచి ప్రారంభించగలిగింది. 2010 లో పెళ్లయ్యాక 2012 లో విన్‌స్టన్, విరాజ్ అనే కవలలు, ఆ తర్వాత 2017 లో ఆర్థర్ జన్మించారు. గతంలో షంషేర్ అనే మరో కుమారుడు గుండె సంబంధిత వ్యాధితో చనిపోవడం ఆమెను మరింత కుంగదీసింది. 2025 నవంబర్‌లో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్ కోర్టులో గృహహింస, క్రూరత్వం కింద కేసు నమోదు చేసిన సెలీనా, ప్రస్తుతం తన ముగ్గురు పిల్లల కోసం న్యాయపోరాటం చేస్తోంది. ఆస్ట్రియా కోర్టు జాయింట్ కస్టడీ ఇచ్చినప్పటికీ, పిల్లలకు తల్లిపై విషం నూరిపోస్తూ కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వడం లేదని సెలీనా జైట్లీ ఆవేదన వ్యక్తం చేసింది.

 

 

 

Celina Jaitly, Celina Jaitly divorce, Peter Haag domestic violence, Celina Jaitly children, Bollywood celebrity divorce, Celina Jaitly interview

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com