
తెలుగు సినిమా కథల హాయి తీరు, భావోద్వేగాల నడక తెలుగు ప్రేక్షకుల మనసు నుంచి చెరిగిపోవడం అనేది జరగని పని. మరి తెలుగు కథ, కథనాలకి ఎవరి దిష్టి తగిలిందేమో గాని బడా హీరోలు ఆ ఊసు ఎత్తడం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ని ఒకే ఒక్క ఆలోచన తీవ్రంగా ఊపేస్తోంది. అదే పాన్ ఇండియా క్రేజ్. నేటి ట్రెండ్‌లో కేవలం ఒక ప్రాంతీయ లేదా రీజనల్ సినిమా తీస్తే కలెక్షన్లు రావని, కచ్చితంగా పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే భారీ సక్సెస్ సాధిస్తామనే నమ్మకం చిత్ర పరిశ్రమలో చాలా బలంగా నాటుకుపోయింది. దీనివల్ల వందల కోట్ల భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్, కళ్లు చెదిరే విజువల్ వండర్స్‌తో డ్ మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. కానీ భారీ విజువల్స్ మాత్రమే విజయానికి గ్యారెంటీ కాదని ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు స్పష్టంగా నిరూపించాయి. లోకల్ కంటెంట్ మరియు మన మట్టి వాసనతో కూడిన నేటివిటీతో వచ్చిన చిన్న, మధ్య తరహా చిత్రాలు వందల కోట్ల వసూళ్లను సాధిస్తుంటే, పాన్ ఇండియా రేంజ్ అనుకున్న దాదాపు 20 తెలుగు సినిమాలు పుష్ప 2 తర్వాత బాలీవుడ్ లేదా హిందీ మార్కెట్లో ఘోరమైన పరాజయాన్ని చవిచూశాయి.
మన స్టార్ హీరోల కెరీర్ గ్రాఫ్‌ని ఒకసారి పరిశీలిస్తే ఈ మార్పు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌ని గమనిస్తే బాహుబలి ఘనవిజయం తర్వాత ఆయన ఎంచుకున్న సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి, మరియు త్వరలో రాబోతున్న స్పిరిట్ చిత్రాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా మన తెలుగు సంస్కృతికి లేదా తెలుగు జీవన విధానానికి దగ్గరగా ఉండే కథ కాదు. హీరో ఒక అంతర్జాతీయ డాన్ కావడం, లేదా ప్రపంచ స్థాయి క్రైమ్ సిండికేట్స్‌తో పోరాడే పోలీస్ ఆఫీసర్ కావడం లాంటి కథలనే ఎంచుకుంటున్నారు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ పెరిగే కొద్దీ ఇలా తెలుగు నేటివిటీ పూర్తిగా తగ్గిపోతుందనే విమర్శలు సినిమా విశ్లేషకుల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సైతం 'అర్జున్ రెడ్డి' వంటి అచ్చమైన లోకల్ సినిమా తర్వాత ఇప్పుడు పూర్తిగా గ్లోబల్ మరియు యూనివర్సల్ కథల వైపే అడుగులు వేస్తుండడం గమనార్హం.
మరోవైపు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా కథాంశం కూడా ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్ మాఫియా, అంతర్జాతీయ కుట్రల నేపథ్యంలో సాగుతుందని అర్ధమయింది. ప్రశాంత్ నీల్ సృష్టించే ప్రపంచం ఎప్పుడూ కేజీఎఫ్ లేదా సలార్ తరహాలోనే ఒక ఊహాజనిత, కల్పిత సామ్రాజ్యాలు మరియు భారీ యాక్షన్ ఎలివేషన్ల చుట్టూనే తిరుగుతుంది. ఎన్టీఆర్ లాంటి అద్భుతమైన నటన, తెలుగు డైలాగ్ డెలివరీ ఉన్న హీరో చేతిలో ఉన్నా.. కథ మాత్రం తెలుగు నేల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతోంది. దీనిని బట్టి మన టాలీవుడ్ స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్లు కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాకుండా, ప్రపంచ వ్యాప్త మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ కథలను అల్లుకుంటున్నారనే విషయం స్పష్టమవుతోంది. మహేష్, రాజమౌళి ల వారణాసి కూడా పాన్ ఇండియా నేపథ్యంలోనే కథనం తెరకెక్కబోతుంది.
Also read: Yogibabu: యోగిబాబు సంచలన నిర్ణయం.. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానులు
అయితే, పక్కనే ఉన్న తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమల ప్రయాణం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఆయా పరిశ్రమలు గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నప్పటికీ.. తమ మట్టి కథలను, అచ్చమైన ప్రాంతీయ సంస్కృతిని ఎక్కడా వదిలిపెట్టడం లేదు. వారు తమ నేటివిటీని వెండితెరపై బలంగా చూపిస్తూనే రీజనల్ కాన్సెప్టులతో గ్లోబల్ సక్సెస్ మరియు వందల కోట్ల కలెక్షన్లను సాధించి చూపిస్తున్నారు. మరి మన టాలీవుడ్ కూడా కేవలం కల్పిత ప్రపంచాల వెనుక పరిగెత్తకుండా, ఈ పాన్ ఇండియా ప్రయాణంలో తెలుగు నేటివిటీని, కథల్లోని ఆత్మను ఎంతవరకు కాపాడుకుంటుందో కాలమే నిర్ణయించాలి అనే మాటలు సోషల్ మీడియా వ్యాప్తంగా పలు సినీ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు





.webp)
