Home

»

Latest News

సంస్కృత చలనచిత్ర పరిశ్రమకు శ్రీకారం చుట్టిన‌ జనార్థన మహర్షి!

May 13, 2026

భారతీయ చలనచిత్ర రంగం అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ మరియు హిందీ పరిశ్రమలు. కానీ, వీటన్నింటికీ మూలమైన సంస్కృత భాషలో ఒక పూర్తిస్థాయి సినిమా ఇండస్ట్రీ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచననే నిజం చేస్తూ, ప్రముఖ రచయిత మరియు దర్శకుడు జనార్థన మహర్షి ఒక చారిత్రాత్మక అడుగు వేశారు. భారతీయ సంస్కృతిని, సంస్కృత భాషా మాధుర్యాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన "సంస్కృత ఫిలిం ఇండస్ట్రీ"ని ప్రారంభిస్తున్నారు.

సంస్కృతం అంటే కేవలం పౌరాణికాలు, శ్లోకాలకే పరిమితం అనే అపోహను తొలగించడమే ఈ ఇండస్ట్రీ ముఖ్య ఉద్దేశం. అస‌లు సంస్కృత ఫిలిం ఇండస్ట్రీని స్థాపించాల‌న్న ఆలోచ‌న ఎందుకు వ‌చ్చింది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ల‌బోతున్నారు, ఇందులో ఎంత మంది భాగ‌స్వాములుగా చేరబోతున్నారు. ఈ సంస్థ కార్య‌క‌లాపాలు ఎలా ఉంటాయి అనే విష‌యాల గురించి జనార్థన మహర్షి మాట్లాడుతూ.. "తెలుగు, తమిళ పరిశ్రమల తరహాలోనే ఇది కూడా ఒక సినిమా ఇండస్ట్రీ. ఇందులో కేవలం పౌరాణికాలే కాదు, చక్కని సెన్సిబుల్ కథలతో కూడిన కమర్షియల్ సినిమాలు కూడా నిర్మించవచ్చు. ఇప్పటికే నేను 'విశ్వదర్శనం', 'దేవస్థానం' వంటి చిత్రాల్లో శ్లోకాలను ఆ విధంగానే ప్రయోగించాను. ఇప్పుడు మరింత సీరియస్‌గా సంస్కృత భాష ప్రధానంగా సినిమాలు తీయబోతున్నాను" అని వెల్లడించారు.

ఈ ప్రాజెక్ట్ వెనుక ఒక ఆసక్తికరమైన తర్కాన్ని ఆయన వినిపించారు. మన ఆధ్యాత్మిక గ్రంథాలైన విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, భగవద్గీత అన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒకవేళ భగవంతుడు మన ముందు ప్రత్యక్షమైతే, ఆయనతో సంభాషించడానికి సంస్కృతం అవసరమని, అలాగే స్వర్గానికి వెళ్ళిన తర్వాత దేవతలతో మాట్లాడాలన్నా ఈ భాషలో ప్రావీణ్యం ఉండాల‌న్న‌ది ఆయ‌న ఉద్దేశం. అందుకే 'జయతు జయతు సంస్కృతం' అనే కాన్సెప్ట్‌తో ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నారు.

Bharathiya Sanskrit Film Federation పేరుతో ప్రారంభిస్తున్న ఈ ఇండస్ట్రీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. మే 16 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో కన్నడ నుంచి రాక్‌లైన్ వెంకటేష్‌తో పాటు తనికెళ్ల భరణి, కె.వి.రమణాచారి వంటి ఎందరో ప్రముఖులు భాగస్వామ్యం కాబోతున్నారు. ఈ ఇండ‌స్ట్రీలో ఎవరైనా సంస్కృత భాష‌లో  సినిమాలు తీయవచ్చు లేదా దర్శకత్వం వహించవచ్చు. వారికి ఈ ఇండస్ట్రీ తరపున పూర్తి సహకారం ఉంటుంది. అంతేకాదు, వారి సినిమాలకు సంబంధించిన వరల్డ్ వైడ్ ప్రమోషన్స్, ఫిలిం ఫెస్టివల్స్‌కు పంపడం, కమర్షియల్ డీల్స్‌లో సహాయం చేయడం వంటి బాధ్యతలను జనార్థన మహర్షి స్వయంగా తీసుకోనున్నారు.

గతంలో జి.వి.అయ్యర్ వంటి వారు సంస్కృతంలో చిత్రాలు తీసినప్పటికీ, ఇప్పుడు జనార్థన మహర్షి ఏకంగా 12 సినిమాలు తీయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇప్పటికే మూడు సినిమాలను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. సంస్కృత సినిమాను ఒక భాషగా ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న జనార్థన మహర్షి 'సన్ ఆఫ్ సాన్‌స్క్రిట్' అనిపించుకుంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చారిటీ మరియు ట్రస్ట్ రూపంలో సాగే ఈ ప్రయత్నం భారతీయ సినిమా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆశించవచ్చు. సంస్కృత భాషాభిమానులు, సినీ ప్రియులు ఈ వినూత్న ప్రయత్నానికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com