
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పలువురు స్టార్స్ ఓటీటీలో సందడి చేస్తున్నారు. అదే బాటలో ఓటీటీలో ఓ వెబ్ సిరీస్ తో అలరించడానికి అక్కినేని హీరో నాగ చైతన్య సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. 'దూత' పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్ కి విక్రమ్ కె.కుమార్ దర్శకుడు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'మనం' మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే 'థాంక్యూ' మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలోనే 'దూత' సిరీస్ రాబోతోంది. తాజాగా ఈ సిరీస్ నుంచి చైతన్య లుక్ రివీల్ అయింది.
తమ సంస్థ నుంచి రాబోతున్న సిరీస్ లు, సినిమాలను ప్రకటించేందుకు తాజాగా అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ వేడుక నిర్వహించింది. బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమంలో 'దూత' టీమ్ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ.. ఓటీటీల ద్వారా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకులను అలరించే అవకాశం ఉంటుందని, తమ పెర్ఫామెన్స్ ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అన్నాడు. హారర్ సినిమాలు చూడటానికి భయపడే తాను ఓ సవాలుగా స్వీకరించి ఈ హారర్ సిరీస్ లో నటిస్తున్నానని చైతన్య తెలిపాడు.

'దూత' సిరీస్ నుంచి తాజాగా చైతన్య లుక్ రివీల్ చేశారు. కళ్లద్దాలు పెట్టుకొని ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఆందోళన పడుతున్నట్లుగా ఉన్న చైతన్య లుక్ ఆకట్టుకుంటోంది. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించబడుతున్న ఈ సిరీస్ లో చైతన్యతో పాటుగా ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే చైతన్య బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టులో విడుదల కానుంది. అలాగే 'దూత' సిరీస్ ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్స్ తో చైతన్య నార్త్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడేమో చూడాలి.






