Home

»

Latest News

దీపావళి బరిలో నయనతార.. ‘మహాశక్తి’గా విశ్వరూపం.! 

Sep 14, 2026 1:10PM

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'మూకుతి అమ్మన్ 2' నుంచి ఊహించని ధమాకా వచ్చేసింది. వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ 'రైజ్ ఆఫ్ మహాశక్తి' పేరుతో విడుదల చేసిన టీజర్ ఇప్పుడు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొదటి భాగాన్ని మించి ఈ సీక్వెల్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో, పౌరాణిక ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దినట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతోంది.

టీజర్ గమనిస్తే కథనం చాలా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఒక ప్రాచీన రాజ్యాంపై శత్రువులు విరుచుకుపడటం, ప్రజలు ప్రాణభయంతో అల్లాడిపోవడం వంటి పవర్ ఫుల్ విజువల్స్‌తో ప్రారంభమైన వీడియో.. ఆ తర్వాత ప్రస్తుత కాలానికి మారుతుంది. ఆధునిక ప్రపంచంలోనూ ఏదో ఊహించని మహా విపత్తు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నట్లుగా చూపించారు.

అలాంటి క్లిష్ట సమయంలో ప్రజలను రక్షించేందుకు శ్రీమహాశక్తి ఆవిర్భవిస్తుంది. నయనతార మరోసారి 'మూకుతి అమ్మన్' శక్తివంతమైన దైవ అవతారంలో చేతిలో ఆయుధం పట్టి శత్రుసంహారానికి సిద్ధమైన తీరు రోమాంచితంగా ఉంది. మొదటి భాగంలో కేవలం భక్తి, సామాజిక అంశాల చుట్టూ కథ నడిచినా, ఈసారి మాత్రం భారీ దైవిక పోరాటం (Divine Fantasy Action) ఉండబోతోందని స్పష్టమవుతోంది.

2020లో వచ్చిన 'మూకుతి అమ్మన్' (తెలుగులో అమ్మోరు తల్లి) బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదటి భాగానికి ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించగా, ఈ సీక్వెల్ బాధ్యతలను విజువల్ వండర్స్ డైరెక్టర్ సుందర్.సి చేతికి తీసుకోవడం విశేషం. దేవుడు-పౌరాణిక అంశాలను కమర్షియల్ ఫార్మాట్‌లో తీయడంలో సుందర్.సి సిద్ధహస్తుడు కావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. తెలుగులో ఈ చిత్రానికి ‘మహాశక్తి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 

ఈ భారీ చిత్రంలో నయనతారతో పాటు రెజీనా కసాండ్రా, దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి, అభినయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిప్‌హాప్ తమిళా అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐశరి కె. గణేష్ ఈ చిత్రాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ విశేషంగా వైరల్ అవుతోంది. నయనతార డివైన్ లుక్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాను రాబోయే దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి మహాశక్తిగా నయనతార బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!

 

 

[Mookuthi Amman 2 Teaser, Nayanthara Mookuthi Amman 2, Sundar C Mookuthi Amman 2, Rise Of Mahashakti Teaser, TeluguOne TMDB Movie News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com