కృతి శెట్టితో చైతన్య.. అలా మొదలైంది!
on Jun 23, 2022
కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో అక్కినేని యువ హీరో నాగ చైతన్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నట్లు ఈరోజు ప్రకటించారు. ఈ ఏడాది 'బంగార్రాజు' సినిమాతో విజయాన్ని అందుకున్న చైతన్య-కృతి జోడి మళ్ళీ జత కట్టడం విశేషం. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో ఇప్పటికే 'ది వారియర్' చేస్తున్న కృతి వరుసగా రెండో సినిమా చేస్తుండటం మరో విశేషం. ఈ సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది.
చైతన్య కెరీర్ లో 22వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు బోయపాటి శ్రీను, లింగుస్వామి, రానా దగ్గుబాటి, శివ కార్తికేయన్ తదితరులు హాజరయ్యారు. హీరో హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బోయపాటి శ్రీను క్లాప్ కొట్టారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీత దర్శకులుగా వ్యవహరించనున్నారు.
కాగా చైతన్య, విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' సినిమా పూర్తి చేశాడు. జులై 8 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మూవీ 'లాల్ సింగ్ చద్దా'లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా ఆగష్టు 11 న విడుదల కానుంది. మరోవైపు విక్రమ్ డైరెక్ట్ చేస్తున్న 'దూత' సిరీస్ తో ఓటీటీలోనూ అడుగు పెడుతున్నాడు.