ENGLISH | TELUGU  

Kobali review: కోబలి వెబ్ సిరీస్ రివ్యూ

on Feb 5, 2025


 

వెబ్ సిరీస్: కోబలి
నటీనటులు: రవిప్రకాశ్, శ్యామల, భరత్, తరుణ్ రోహిత్,  మణికంట వారణాసి, యోగి కత్రి, రాఖీ సింగ్ తదితరులు
ఎడిటింగ్: మద్దాలి కిశోర్
మ్యూజిక్: హరి గౌర
సినిమాటోగ్రఫీ: బాచు రోహిత్
దర్శకత్వం: రేవంత్ లెవక
నిర్మాతలు:  కామిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తిరుపతి శ్రీనివాస్ రావు
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

రవిప్రకాశ్ చాలా కాలంగా సినిమాలలో కనిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అలాంటి ఆయన ప్రధాన పాత్రను పోషించిన వెబ్ సిరీస్ 'కోబలి'. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హట్ స్టార్ లో ఉన్న ఈ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం...

కథ:

 ముళ్లకట్ట గ్రామంలో సాంబయ్య కుటుంబం నివసిస్తు ఉంటుంది. సాంబయ్యకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు గోపి, రెండో కొడుకు శీను (రవిప్రకాశ్), మూడో కొడుకు రాము. సాంబయ్య నాటుసారా కాస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. గోపీకి శాంతతో వివాహమవుతుంది. ఆయన కొడుకు రాజు టీనేజ్ లో ఉంటాడు. శీను వివాహం మీరా (శ్యామల)తో జరుగుతుంది. వారికి ఒక పాప ఉంటుంది. ఆయన మెకానిక్ షెడ్ చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో గోపీ ఎవరికి తెలియకుండా సుజాతను రెండో వివాహం చేసుకొని వెంకటాపురంలో ఆమెతో కాపురం పెడతాడు. ఆమెకి రమణ - పీరి అనే అన్నదమ్ములు ఉంటారు. రమణపై అనేక క్రిమినల్ కేసులు ఉంటాయి. గోపీ ఆస్తులు రాయించుకుని అతనిని తరిమేయాలనే ఆలోచనలో సుజాత, ఆమె అన్నదమ్ములు ఉంటారు. సరైన సమయం కోసం వాళ్లు వెయిట్ చేస్తుంటారు. సుజాత కుటుంబ సభ్యులతో గోపీ గొడవపడతాడు. ఆ గొడవలోనే సుజాత చనిపోతుంది. దాంతో రమణ గ్యాంగ్ అతనిని వెంటాడుతుంటుంది. వాళ్ల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో, శీను గాయపడటానికి గోపీ కారకుడు అవుతాడు. గాయాలతో శీను హాస్పిటల్ పాలవుతాడు. గంజాయి కేసు విషయంలో రాము జైలుకు వెళతాడు. ఇలా ఇంటి దగ్గర ముగ్గురు మగాళ్లు లేని సమయంలో, మిగతా కుటుంబ సభ్యులందరిని చంపేయమని రమణ తన మనుషులను పంపిస్తాడు. రమణ మనుషుల నుంచి గోపీ తప్పించుకుంటాడా? తనవారిని కాపాడుకోవడానికి శీను చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా అనేది మిగతా కథ. 

విశ్లేషణ:

కొన్నేళ్ళ క్రితం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అయితే అందులో ఉండే కుటుంబసభ్యులు ఎవరేంటనేది అందరికి తెలిసేది కాదు. అలాంటి ఓ ఉమ్మడి కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ముల చుట్టూ ఈ కథ సాగుతుంది. అయితే మనకి తెలిసిన శత్రువు కంటే తెలియని శత్రువు చాలా ప్రమాదకరం అంటు ఎనిమిది ఎపిసోడ్ లతో సాగే 'కోబలి' చివరి వరకు ఎంగేజింగ్ గా ఉంది. మొదటి రెండు ఎపిసోడ్ లు కాస్త కన్ఫూజన్ గా అనిపించినా మూడో ఎపిసోడ్ నుండి కథ పరుగులు పెడుతుంది. మూడో ఎపిసోడ్ వరకు 'కోబలి' యాక్షన్ డ్రామాగా సాగినా ఆ తర్వాత సర్వైవల్ థ్రిల్లర్ గా మారిపోతుంది.

మొదటి ఎపిసోడ్:

షాడో ఆఫ్ ది ఫాస్ట్ ... ఇరవై అయిదు నిమిషాలు ఉంటుంది. ఒక జాతరతో మొదలై అదే నరుక్కోవడం, చంపుకోవడంతో క్యారెక్టర్లని పరిచయం చేస్తాడు. రెండో ఎపిసోడ్: ది డ్రగ్ లీడ్.. తమ్ముడు ఇరుక్కున్న ప్రాబ్లమ్ నుండి అన్న ఎలా కాపాడాడంటూ చూపించిన తీరు బాగుంది. డ్రామాతో పాటు కథలో ఓ సీరియస్ నెస్ క్రియేట్ అయ్యింది‌. మూడో ఎపిసోడ్: ది బిట్రెయల్ : ఎవరినో తల నరికనట్టు చూపించి కాసేపటికి ఎవరో రివీల్ చేస్తారు. నాల్గవ ఎపిసోడ్: ది ఫస్ట్ స్ట్రైక్: సూపర్ ఎపిసోడ్ ఇది. ముప్పై నిమిషాలు ఉంటుంది. ఎక్కడ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారో అనే టెన్షన్ సిరీస్ చూసే అందరిలో నెలకొంటుంది. 

ఎపిసోడ్ సిక్స్ :

ది హంట్ బిగిన్స్ .. ఇరవై ఏడు నిమిషాలు ఉంటుంది‌.‌ ఎంగేజింగ్ గా సాగుతుంది. ఎనిమిదో ఎపిసోడ్: ది రికానింగ్.. ఐటమ్ సాంగ్ తో మొదలై ఇక ఆఖరి ఘట్టానికి సిద్ధమనేలా ఎపిసోడ్ చివరన చూపిస్తారు. ఇక చివరి ఎపిసోడ్: ది కాన్ఫెండెషన్.. ట్విస్ట్ తో మొదలై.. పోలీసు ఎప్పుడు నిజం తెలుసుకొని ఫైట్ చేస్తాడో అక్కడి నుండి కథ మలుపుతిరుగుతుంది. కొన్ని ప్రశ్నలని ఆడియన్స్ కి వదిలేస్తూ మరో సీజన్ ఉంటుందంటు చివరల్లో వచ్చే ట్విస్ట్ బాగుంటుంది. 

ఈ సిరీస్ లో బూతులు కాస్త ఎక్కువే ఉన్నాయి‌. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. హరిహర బిజిఎమ్ బాగుంది. మద్దాలి కిశోర్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. రోహిత్ బాచు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

నటీనటుల పనితీరు:

శీనుగా రవిప్రకాశ్ సిరీస్ కి ఫ్రధాన బలంగా నిలిచాడు. మీరాగా శ్యామల ఆకట్టుకుంది. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా :  థ్రిల్లింగ్ సిరీస్ విత్ ఎంగేజింగ్ డ్రామా!

రేటింగ్ : 2.5 / 5

✍️. దాసరి  మల్లేశ్

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.