పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రెండు సినిమాల రిలీజ్ డేట్స్ లాక్!
on Apr 23, 2025
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలకు తెలుగు నాట ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే కొన్నేళ్లుగా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో సినిమాల స్పీడ్ తగ్గింది. పైగా ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా కావడంతో.. కొత్త సినిమాలు అంగీకరించడం మాట అటుంచితే, గతంలో కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయడానికే చాలా సమయం పడుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా.. గతంలో అంగీకరించిన సినిమాలు విడుదలైనా చాలని ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం పవన్ చేతిలో 'హరి హర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి సినిమాలు ఉన్నాయి. 'హరి హర వీరమల్లు' షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ మరో నాలుగైదు రోజులు డేట్స్ కేటాయిస్తే సరిపోతుందని సమాచారం. నిజానికి ఈ నెల మొదట్లో పవన్ షూట్ లో పాల్గొనాలని భావించారు. కానీ, ఆయన తనయుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడటంతో డేట్స్ కేటాయించలేకపోయారు. దీంతో మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమాని మరోసారి వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరమల్లు ఇప్పటికే అటుఇటుగా పదిసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి కొత్త డేట్ ని వెతికే పనిలో చిత్ర బృందం ఉంది. త్వరలో వీరమల్లు బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తానని పవన్ మాట ఇచ్చారట. మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో సినిమాని విడుదల చేయాలని మూవీ టీం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
'ఓజీ' షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. జూన్, జూలైలో డేట్స్ కేటాయించి దీనిని కూడా పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే 'ఓజీ' సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది అంటున్నారు. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే.. 'వీరమల్లు', 'ఓజీ'తో పోలిస్తే.. షూటింగ్ చాలా తక్కువగా జరిగింది. దీంతో అసలు 'ఉస్తాద్' ఉంటుందా లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో కూడా ఉన్నాయి. కానీ, పవన్ మాత్రం జూలై తర్వాత డేట్స్ ఇస్తానని నిర్మాతలకు చెప్పినట్లు వినికిడి. 'ఉస్తాద్' సంగతేమో కానీ.. న్యూస్ వినిపిస్తున్నట్టుగా మే లేదా జూన్ లో 'వీరమల్లు', సెప్టెంబర్ 'ఓజీ' విడుదలైతే మాత్రం పవన్ అభిమానుల ఆనందాలకు అవధులు ఉండవు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
