బాలయ్య కూతురిగా శ్రీలీల.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి
on May 22, 2022
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మే 27న 'F3' సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాతో డైరెక్టర్ గా డబుల్ హ్యాట్రిక్ కొడతానని నమ్మకంగా ఉన్న అనిల్.. తన తదుపరి సినిమాని నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే. 'F3' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యతో చేయబోతున్న సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'అఖండ'తో సంచలన విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమా తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని, ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని తెలిపాడు. తాను ఇప్పటిదాకా చేసినట్లుగా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ చేయట్లేదని, బాలకృష్ణ గారితో కొత్త ప్రయోగం చేస్తున్నానని అన్నాడు. ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ళ పాత్రలో కనిపిస్తారని, ఆయనకు కూతురుగా శ్రీలీల నటిస్తుందని చెప్పాడు. ఆయన నుంచి ఆశించే యాక్షన్ ఎపిసోడ్స్, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటూనే.. కొత్తకోణంలో చూపించబోతున్నట్లు తెలిపాడు. 'పోకిరి', 'గబ్బర్ సింగ్', 'అర్జున్ రెడ్డి' సినిమాల తరహాలో హీరో చుట్టూనే కథ తిరుగుతుందని.. ఇది తన కెరీర్ లో బెస్ట్ వర్క్స్ లో ఒకటిగా నిలిచిపోతుందని అనిల్ చెప్పుకొచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే ఆలోచన ఉందని, కానీ ప్రస్తుతం ఆయన వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారని అన్నాడు. అవకాశమొస్తే తప్పకుండా ఆయనతో మంచి సినిమా తీస్తానని అనిల్ తెలిపాడు.