
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అలాంటి ఏయన్నార్, వాణిశ్రీ జంటగా నటించిన మొదటి సినిమా `ఆత్మీయులు`. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కమర్షియల్ గా రాణించడమే కాకుండా మ్యూజికల్ సెన్సేషన్ గానూ నిలిచింది. అలాగే `ద్వితీయ ఉత్తమ చిత్రం`గా `నంది` పురస్కారాన్ని సైతం అందుకుంది. అదేవిధంగా తమిళంలో `పెన్నిన్ వాళగై` (సుధాకర్) పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది.
అన్నాచెల్లెళ్ళ అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఏయన్నార్ కి చెల్లెళ్ళుగా విజయ నిర్మల, చంద్రకళ నటించగా ఇతర ముఖ్య పాత్రల్లో చంద్రమోహన్, గుమ్మడి, నాగభూషణం, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, సూర్యకాంతం, రాధాకుమారి అలరించారు.
స్వరచక్రవర్తి సాలూరి రాజేశ్వరరావు బాణీలు అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ విశేషాదరణ పొందాయి. ``మదిలో వీణలు మ్రోగే``, ``ఓ చామంతి ఏమిటే``, ``అన్నయ్య కలలే పండెను``, ``కళ్ళలో పెళ్ళి పందిరి``, ``చిలిపి నవ్వుల``, ``ఈ రోజుల్లో పడుచువారు`` వంటి పాపులర్ సాంగ్స్ ఈ సినిమాలోనివే. దుక్కిపాటి మధుసూదనరావు నిర్మించిన `ఆత్మీయులు`.. 1969 జూలై 17న విడుదలై జననీరాజనాలు అందుకుంది. నేటితో ఈ మ్యూజికల్ సెన్సేషన్.. 52 వసంతాలు పూర్తిచేసుకుంది.






