
- టాలీవుడ్ కు బిగ్గెస్ట్ ఫెస్టివల్
- వేసవి బరిలో నాలుగు భారీ సినిమాలు
- దద్దరిల్లిపోనున్న ఇండియన్ బాక్సాఫీస్
గత కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్‌ను టాలీవుడ్ ఆశించిన స్థాయిలో క్యాష్ చేసుకోలేకపోతోందనే అసంతృప్తి సినీ వర్గాల్లో ఉంది. 2026 వేసవి కూడా పెద్దగా సందడి లేకుండానే సాగిపోతోంది. సరైన ప్లానింగ్ లేకపోవడం, భారీ సినిమాలు బరిలో లేకపోవడంతో సమ్మర్ సీజన్ కళ తప్పింది. అయితే, 2027 వేసవి మాత్రం టాలీవుడ్‌కు అత్యంత కీలకం కానుంది. అగ్ర హీరోలందరూ తమ భారీ సినిమాలతో ఈ సీజన్‌ను పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.
ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా (Spirit):
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' మూవీ 2027 వేసవికి అదిరిపోయే స్టార్ట్ ఇవ్వనుంది. ఈ సినిమా మార్చి 5న విడుదల కానుంది. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. పైగా ఆయనకు డైరెక్టర్ సందీప్ రెడ్డి తోడవ్వడంతో.. 'స్పిరిట్' సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మహేష్ బాబు - రాజమౌళి (Varanasi):
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో రాబోతున్న గ్లోబల్ రేంజ్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి'.. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలే 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి గ్లోబల్ సక్సెస్ ల తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా. దానికి తోడు ఇందులో భారతీయ పురాణగాథల ప్రస్తావన ఉండనుంది. అందుకే 'వారణాసి'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ - అట్లీ (Raka):
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'రాకా' సినిమా కూడా 2027 వేసవి టార్గెట్ గానే రూపొందుతోంది. అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్, 'జవాన్' తర్వాత అట్లీ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో.. 'రాకా' దెబ్బకు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ (NTR - Neel):
అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ 'డ్రాగన్'.. 2027 వేసవి ముగింపులో రానుంది. ఈ చిత్రాన్ని జూన్ 11న విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. అసలే ఎన్టీఆర్-నీల్ కాంబో కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. పైగా ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ప్రశాంత్ నీల్ గతంలోనే చెప్పారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామీ చూస్తామని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
మొత్తానికి 2027 సమ్మర్ సీజన్ ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల సినిమాలతో దద్దరిల్లిపోనుంది. ఈ రేసులో ఇంకా ఎంతమంది హీరోలు చేరుతారో చూడాలి. టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ సమ్మర్ సీజన్ కాబోతుందనడంలో డౌట్ లేదు.






