ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త అధ్యాయం తిరగరాసిన సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి తెలుసుకోవాలని కోట్లాది మంది అభిమానులు ఆరాటపడుతుంటారు. అలాంటి ఫ్యాన్స్‌కు తలైవా కూతురు, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ఒక తీపి కబురు అందించారు. తండ్రి జీవిత అనుభవాలతో ఒక ప్రత్యేకమైన పుస్తకం సిద్ధమవుతోందని వెల్లడించారు.
సౌందర్య రజనీకాంత్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అధికారికంగా పంచుకున్నారు. తన తండ్రి ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ జీవితంలోని మజిలీలు, ఆయన సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లను సమగ్రంగా ఈ ఆత్మకథలో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తక రచన ప్రాసెస్ ప్రస్తుతం ఎంతో ప్రత్యేకంగా, శ్రద్ధగా సాగుతోందని పేర్కొన్నారు.
‘ఒక యోగి ఆత్మకథ’ (Autobiography of a Yogi) పుస్తకం ఎలాంటి స్ఫూర్తిని నింపుతుందో, తన తండ్రి ఆత్మకథ కూడా రాబోయే తరాలకు అంతటి స్ఫూర్తినిస్తుందని సౌందర్య ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, భవిష్యత్తులో ఒకవేళ తన తండ్రి బయోపిక్‌ను వెండితెరపై డైరెక్ట్ చేసే అవకాశం వస్తే, అది తనకు దక్కే అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తానని మనసులోని మాటను బయటపెట్టారు.
ఒక సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన శివాజీరావు గైక్వాడ్.. తలైవా రజనీకాంత్‌గా మారి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఎందరికో ఆదర్శం. క్రమశిక్షణ, సృజనాత్మకతకు స్పష్టత ఉండడమే ఆయన విజయ రహస్యాలని, ఈ విషయాన్నే తన తండ్రి తనకు నేర్పించారని సౌందర్య గుర్తుచేసుకున్నారు.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ అభిమాన నటుడి జీవిత విశేషాలను, ఎవరికీ తెలియని రహస్యాలను త్వరలోనే పుస్తక రూపంలో చదవబోతున్నామనే వార్త తెలుసుకుని రజనీ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
మరోవైపు, సౌందర్య రజనీకాంత్ ప్రొడక్షన్ వ్యాపారంలోనూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆమె నిర్మాణంలో బాలాజీ మోహన్ దర్శకత్వంలో 'లవ్' అనే రోమాంటిక్ తమిళ వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంటోంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రజనీకాంత్ పుస్తకం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకునేందుకు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Rajinikanth Autobiography, Soundarya Rajinikanth, Rajinikanth Life Story, Rajinikanth Biopic Updates, Superstar Rajinikanth News






