
ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని ప్రమాణాలు చేసినా.. చిన్న చిన్న అపార్థాలు ఒక్కోసారి బంధాలను దూరం చేస్తుంటాయి. అయితే ఒకరినొకరు అర్థం చేసుకుంటే మళ్లీ కలవడం కూడా సాధ్యమే. ఇప్పుడు క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ విషయంలోనూ ఇదే జరిగింది. కొన్ని వారాల క్రితం నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు మళ్లీ ఒక్కటైంది. అంతేకాదు.. తాము ఎందుకు విడిపోయామో కూడా ఆకృతి స్వయంగా వెల్లడించింది.
పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్‌ల నిశ్చితార్థం ఈ ఏడాది మార్చి 8న జరిగింది. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న ఈ జంట.. నిశ్చితార్థం ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పృథ్వీ షా కూడా తమ బంధంపై ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు. దీంతో వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
కానీ, అంతలోనే కథ అడ్డం తిరిగింది. సెప్టెంబర్‌లో తాము విడిపోతున్నట్లు ఆకృతి ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. భవిష్యత్తు లక్ష్యాలు, పరిస్థితులు వేర్వేరుగా ఉండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె అప్పట్లో వెల్లడించింది. దీంతో వీరిద్దరి బంధానికి ముగింపు పడిందని అంతా భావించారు.
అయితే ఇప్పుడు ఆకృతి చేసిన ప్రకటనతో ఈ వ్యవహారంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. తమ బంధం గురించి పూర్తిగా తెలియని కొందరి మాటలు తన నిర్ణయంపై ప్రభావం చూపాయని ఆమె వెల్లడించింది. ఇతరుల అభిప్రాయాలను నమ్మి, పృథ్వీతో తనకున్న సంబంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చింది.

నిజానికి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాల్సిన సమయంలో అలా చేయకుండా నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం తొందరపాటు నిర్ణయమని ఆకృతి అంగీకరించింది. తన నిర్ణయం వల్ల పృథ్వీకి కలిగిన బాధకు తానే బాధ్యత వహిస్తానని కూడా స్పష్టం చేసింది.
తాజాగా ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారట. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత తమ బంధాన్ని మరోసారి కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఆకృతి వెల్లడించింది. తమ భవిష్యత్తు విషయంలో ఇతరుల అభిప్రాయాల కంటే తమ అవగాహన, నమ్మకం, ప్రేమకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపింది.
ఆకృతి చేసిన ఈ ప్రకటనను పృథ్వీ షా కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. దీంతో వీరిద్దరూ మళ్లీ కలిసిన విషయం స్పష్టమైంది. తమ కొత్త ఆరంభాన్ని గౌరవించాలని, వ్యక్తిగత జీవితంపై అనవసరమైన ఊహాగానాలు చేయొద్దని ఈ జంట కోరుతోంది.
ఇది కూడా చదవండి: హైడ్ & సిల్క్.. చీరతో మొదలయ్యే ప్రేమకథ.!
[Prithvi Shaw Akriti Agarwal Reunion, Akriti Agarwal Instagram, Akriti Agarwal Engagement, Prithvi Shaw Instagram, Prithvi Shaw Engagement, Prithvi Shaw, Akriti Agarwal, Telugu Film News]





