గ్లామరస్ రోల్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన అందాల భామ నిధి అగర్వాల్ ఇప్పుడు ఒక పూర్తి స్థాయి వైవిధ్యమైన కథాంశంతో అలరించేందుకు సిద్ధమయ్యారు. తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ముద్దుగుమ్మ ఒక సరికొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.
ఈసారి నిధి ఒక మైథలాజికల్ థ్రిల్లర్ నేపథ్యం ఉన్న ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నటించనుండటం విశేషం. వరాహ ఫిల్మ్స్ బ్యానర్‌పై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'తంత్ర' ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నిర్మాణ సంస్థకు ఇది మొదటి సినిమా కావడం గమనార్హం.
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకను సెట్స్‌పై పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖులు కెమెరా స్విచాన్ చేయగా, సరికొత్త ఉత్సాహంతో మొదటి రోజే షూటింగ్ ప్రక్రియను కూడా మేకర్స్ ప్రారంభించారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రంలో నిధి ఒక సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'హరి హర వీర మల్లు', రెబెల్ స్టార్ ప్రభాస్‌తో 'ది రాజా సాబ్' వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటించి వరుస అవకాశాలు అందుకుంటున్న నిధి అగర్వాల్, ఈ మైథలాజికల్ కాన్సెప్ట్‌తో తన నటనలోని మరో కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
సినిమా లాంచ్ సందర్భంగా విడుదల చేసిన నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఒక చేతిలో దీపాన్ని ఆర్పకుండా రక్షిస్తున్నట్లు, బ్యాక్‌గ్రౌండ్‌లో దేవుడి ఆకృతి కనిపిస్తున్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.
సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్ వైరల్ కావడంతో నిధి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ఈసారి నిధి ఖాతాలో గ్యారెంటీ హిట్ పడబోతోంది' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ వివరాలను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
Nidhhi Agerwal, Nidhhi Agerwal New Movie, Srinivas Gopishetti, Mythological Thriller, Varaha Films, Telugu Cinema News






