
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) ఎప్పుడూ లవర్ బాయ్ ఇమేజ్‌తో అలరిస్తుంటాడు. కానీ ఈసారి రూటు మార్చి పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వస్తున్నాడు.
నాగశౌర్య లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తీక్'(Bad Boy Karthik). ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ఈ సినిమా బయటకు వస్తోంది. ఏప్రిల్ 17న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. కొందరైతే "ఇది ఏ కాలం నాటి సినిమా" అంటూ ట్రోల్ చేస్తున్నారు.
2023లో వచ్చిన 'రంగబలి' తర్వాత నాగశౌర్య నుంచి సినిమా రాలేదు. పైగా కొన్నేళ్ళుగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తర్వాత 'బ్యాడ్ బాయ్ కార్తీక్'తో వస్తున్నాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కొన్నేళ్ళుగా ప్రేక్షకులు సినిమా చూసే తీరు మారిపోయింది. అయితే కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ఆదరిస్తున్నారు.. లేదంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కే విజువల్ వండర్స్ కి జై కొడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో స్టార్ హీరోలు సినిమాలు చేసినా ప్రేక్షకులు చూడటానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు. దీంతో నాగశౌర్య లాంటి టాలెంటెడ్ యంగ్ హీరో ఈ ఫార్మాట్ లో సినిమా చేయడం చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.
2014లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు నాగశౌర్య. తన లుక్, కటౌట్ తో టాలీవుడ్ కి మరో మంచి హీరో దొరికాడు అనిపించుకున్నాడు. అందుకు తగ్గట్టే కొన్ని హిట్స్ చూశాడు. అయితే 10-12 ఏళ్ళ సినీ ప్రయాణంలో స్క్రిప్ట్ సెలక్షన్ లో వేసిన కొన్ని తప్పటడుగులు కారణంగా ఫ్లాప్ లే ఎక్కువగా పలకరించాయి.
ఇలాంటి ఫేజ్ ను ఎందరో హీరోలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సాలిడ్ కంటెంట్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. నాగశౌర్య కూడా అలాంటి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. ఇప్పుడు ఆయన నుంచి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' వంటి రొటీన్ కమర్షియల్ సినిమా వస్తోంది. అయితే కొన్ని సినిమాలు ట్రైలర్ తో మెప్పించలేకపోయినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. మరి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' కూడా ఆ లిస్టులో చేరుతుందో లేక నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ పడేలా చేస్తుందో చూడాలి.





