టాలీవుడ్ ఎనర్జిటిక్ అండ్ వర్సటైల్ యాక్టర్ మంచు మనోజ్ వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తాను ఎంతటి ‘రాక్‌స్టార్’ అనేది మరోసారి నిరూపించుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండే మనోజ్.. తాజాగా ఒక అనాథ ఆశ్రమంలో సాటి మనుషుల పట్ల చూపిన ఆదరణ, మానవత్వం ఇప్పుడు సినీ వర్గాల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తోటి వారి కష్టాలను చూసి చలించిపోయే మనోజ్ చేసిన ఈ తాజా మంచి పని ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. తాజాగా మంచు మనోజ్ ‘మాతృదేవోభవ ఆశ్రమం’ను సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న, మానసిక వికలాంగుడైన సంతోష్ అనే అనాథ యువకుడిని చూసి మనోజ్ రియాక్ట్ అయ్యారు. స్వయంగా సెలూన్ కుర్చీ వేయించి, ఆ యువకుడికి తానే స్వయంగా హెయిర్ కట్ చేసి, గడ్డం గీసి అద్భుతమైన మేకోవర్ ఇచ్చారు. అనంతరం ఆ యువకుడిని శుభ్రం చేసి, సరికొత్త వస్త్రాలను బహుకరించారు.
దీన స్థితిలో ఉన్న ఆ యువకుడు, మనోజ్ చేసిన ఈ ‘రీబర్త్ ఛాలెంజ్’తో ఒక్కసారిగా సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. ఒక అనాథ యువకుడు సినిమా హీరో రేంజ్‌లో మెరిసిపోవడం చూసి అక్కడి వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ.. సమాజం ఇంతగా అభివృద్ధి చెందుతున్నా, ఇంకా తోటి మనుషులు రోడ్లపై అనాథలుగా మిగిలిపోవడం తన మనసును తీవ్రంగా గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మానసిక వైకల్యంతో ఉండి బంధువులు వదిలేసిన వారి కోసం త్వరలోనే తన ఆధ్వర్యంలో ఒక భారీ పునరావాస కేంద్రాన్ని నిర్మించబోతున్నట్లు ఒక సెన్సేషనల్ అనౌన్స్‌మెంట్ చేశారు.
ఆశ్రమంలో కొందరు వృద్ధులు, రోగులు సరైన సదుపాయాలు లేక ఇబ్బంది పడటం చూసిన మనోజ్.. వారికి తక్షణమే మంచాలు, కుర్చీలు ఏర్పాటు చేస్తానని నిర్వాహకులకు ప్రామిస్ చేశారు. తమ ఆశ్రమాన్ని సందర్శించి ఇలా సేవ చేసిన మొట్టమొదటి సెలబ్రిటీ మంచు మనోజ్ మాత్రమేనని నిర్వాహకులు కొనియాడారు. ప్రస్తుతం ఈ ‘సెలెబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్’ వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మనోజ్ చేసిన ఈ గొప్ప ప్రయత్నంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘సినిమాల్లోనే కాదు బ్రదర్.. రియల్ లైఫ్‌లోనూ నువ్వే రియల్ హీరో’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విలక్షణ నటుడిగా ప్రేక్షకులను మెప్పించే మనోజ్.. భవిష్యత్తులో మరిన్ని విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో పాటు, త్వరలోనే ప్రారంభించబోయే సామాజిక సేవా ఆశ్రమం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిద్దాం.





