
రియా కపూర్.. బాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ హీరో అనిల్ కపూర్ కుమార్తె.. ప్రముఖ ఫిల్మ్ మేకర్, ఫ్యాషన్ స్టైలిస్ట్ అయిన రియా కపూర్ టీమ్‌లో జరిగిన ఒక భారీ చోరీ ఉదంతం ఇప్పుడు ఇండస్ట్రీ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ మెట్ గాలా ఫ్యాషన్ ఈవెంట్ కోసం రియా కపూర్ ముంబైలోని ప్రముఖ జ్యువెలర్స్ నుండి 1.35 కోట్ల విలువైన వజ్రాల మరియు పచ్చల (ఎమరాల్డ్) బంగారు చెవి జుమ్మీలు అద్దెకి తీసుకుంది. విమాన ప్రయాణంలో ఆమె హ్యాండ్‌బ్యాగ్ నుండి నగలు మాయమవ్వడం బాలీవుడ్ వర్గాల్లో పెను షాక్‌కి గురిచేసింది.
ఈవెంట్‌లో పాల్గొనేందుకు రియా కపూర్ తన వ్యక్తిగత స్టాఫ్, స్టైలింగ్ టీమ్‌తో కలిసి పయనమయ్యారు. ఈ ఈవెంట్ కోసం ముంబైలోని ప్రముఖ మెహతా జ్యువెలర్స్ నుండి రూ. 66 లక్షల విలువైన ఎమరాల్డ్ స్టోన్ డైమండ్ గోల్డ్ ఈరింగ్స్, అలాగే ప్రఖ్యాత గోయెంకా జ్యువెలర్స్ నుండి రూ. 69 లక్షల విలువైన జాంబియన్ ఎమరాల్డ్ స్టోన్ గోల్డ్ బోర్డర్డ్ ఈరింగ్స్‌ను ప్రత్యేకంగా అద్దెకు తీసుకున్నారు. ఈ రెండు అత్యంత ఖరీదైన జుమ్మీల బాక్సులను రియా కపూర్ వద్ద గత 7 సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన పర్సనల్ హ్యాండ్‌బ్యాగ్‌లో భద్రపరుచుకున్నారు. హోటల్ రూమ్‌లోకి వెళ్లిన తర్వాత మెట్ గాలా ట్రయల్స్ కోసం మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ తన హ్యాండ్‌బ్యాగ్ తెరిచి, మరో టీమ్ మెంబర్ షిరీన్‌కు ఇచ్చేందుకు జ్యువెలరీ బాక్సులను బయటకు తీశారు. అయితే ఆ బాక్సులను తెరిచి చూడగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్. ఆ రెండు జ్యువెలరీ బాక్సులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి! రూ. 1.35 కోట్ల విలువైన ఆ రెండు జంటల వజ్రాల జుమ్మీలు అందులో లేవు.
Also read: Kiran abbavaram: కిరణ్ అబ్బవరం స్పీచ్ వైరల్
న్యూయార్క్‌లో ఉండగానే ఈ దొంగతనం గుర్తించినప్పటికీ, టీమ్ అంతా ముంబై తిరిగి వచ్చిన తర్వాతే దీనిపై అధికారికంగా పోలీసులకి ఫిర్యాదు చేశారు. మేకప్ ఆర్టిస్ట్ సవ్లీన్ సింగ్ ఫిర్యాదు మేరకు ముంబైలోని సహార్ పోలీస్ స్టేషన్ అధికారులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 303(2) కింద దొంగతనం కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇంతకీ ఈ భారీ చోరీ ఎక్కడ జరిగింది అనే కోణంలో పోలీసులు తలమునకలవుతున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందా? లేక దుబాయ్ లేఓవర్‌లో ఫ్లైట్ మారే సమయంలో జరిగిందా? లేక న్యూయార్క్ ఎయిర్‌పోర్ట్ మరియు హోటల్ మార్గంలో జరిగిందా? అనే మూడు ప్రధాన అనుమానాస్పద సమయాలపై (టైమ్‌లైన్స్) పోలీసులు ఫోకస్ పెట్టారు. సిసిటివి ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తూ, టీమ్‌తో పాటు ప్రయాణించిన ఇతరుల వివరాలను కూడా వెరిఫై చేస్తున్నారు. సెలబ్రిటీల హై ప్రొఫైల్ ప్రయాణంలో ఇంతటి భారీ మొత్తంలో విలువైన వజ్రాల నగలు మాయమవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనిల్ కపూర్ పెద్ద కుమార్తె సోనమ్ కపూర్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.






