Home

»

Latest News

స్నేహితులను, ఇక్కడి వాతావరణాన్ని త్యాగం చేశా.. మనసు విప్పిన మాధవన్ వారసుడు!

Jun 17, 2026 6:14PM

సినిమా ఇండస్ట్రీలో స్టార్ వారసులు అనగానే అందరూ హీరోలుగా ఎంట్రీ ఇస్తారని ఆశిస్తారు. కానీ వర్సటైల్ యాక్టర్ ఆర్ మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ మాత్రం ఇందుకు భిన్నమైన రూట్ ఎంచుకున్నాడు. వెండితెరపై మెరవాలనే ఆశ లేకుండా, స్విమ్మింగ్‌లో మెడల్స్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. 20 ఏళ్ల ఈ యంగ్ ఫ్రీస్టైల్ స్విమ్మర్ అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి ఎన్నో పథకాలు తెచ్చిపెట్టాడు. అయితే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వేదాంత్.. తన కెరీర్ కోసం భారతదేశాన్ని వదిలి దుబాయ్ వెళ్ళడం వెనుక ఉన్న ఇబ్బందులను, చేసిన త్యాగాలను పంచుకున్నాడు.

కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ మూతపడటంతో, వేదాంత్ కెరీర్ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో మాధవన్ ఫ్యామిలీ 2020లో దుబాయ్‌కి షిఫ్ట్ అయింది. ఆ భారీ మార్పుపై వేదాంత్ స్పందిస్తూ, పుట్టినప్పటి నుండి ఇండియాలోనే పెరగడం వల్ల అకస్మాత్తుగా కొత్త దేశానికి వెళ్లడం తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినట్లు అనిపించిందని అన్నాడు. కొత్త స్కూల్ ఎన్విరాన్మెంట్‌కు అలవాటు పడుతూనే, మరోవైపు స్విమ్మింగ్ ప్రాక్టీస్ మరియు సోషల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయడం ఆ సమయంలో తనకు చాలా పెద్ద షాక్ అని వెల్లడించాడు.

ఇండియాలో తనకు ఎంతో ఇష్టమైన స్నేహితులను, ఇక్కడి అనుకూల వాతావరణాన్ని కెరీర్ కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని వేదాంత్ ఎమోషనల్ అయ్యాడు. అయితే కష్టంగా అనిపించినా ఆ సమయంలో దుబాయ్ వెళ్లాలనే నిర్ణయం తన స్విమ్మింగ్ కెరీర్‌కు ఎంతో మేలు చేసిందని, దానివల్లే తదనంతరం తాను డెన్మార్క్‌లో జరిగిన రేసుల్లో పాల్గొని రాణించగలిగానని చెప్పుకొచ్చాడు. లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని కంఫర్ట్స్‌ని వదులుకోక తప్పదని ఈ యంగ్ ఛాంపియన్ నిరూపించాడు.

తన ఎదుగుదలలో తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం గురించి మాట్లాడుతూ వేదాంత్ చాలా గర్వంగా ఫీల్ అయ్యాడు. పిల్లల కలలను ఇంతలా సపోర్ట్ చేసే అమ్మానాన్నలు దొరకడం అందరికీ సాధ్యం కాదని, ఆ విషయంలో తాను ఎంతో అదృష్టవంతుడినని అన్నాడు. తన తండ్రి మాధవన్, తల్లి సరితా బిర్జేల మద్దతు లేకపోతే తానూ ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని, స్విమ్మింగ్‌లో పేరెంట్స్ కూడా ఒక టీమ్‌లా కలిసి నడవాల్సి ఉంటుందని వేదాంత్ స్పష్టం చేశాడు.

ఈ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ కావడంతో మాధవన్ అభిమానులు మరియు నెటిజన్లు వేదాంత్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒక స్టార్ కిడ్ అయ్యుండి ఎలాంటి హంగూ ఆర్భాటాలకు పోకుండా, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి అంత కష్టపడటం నిజంగా గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మాధవన్ కేవలం రీల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ బెస్ట్ ఫాదర్ అని కొనియాడుతున్నారు.

ఇక నటుడు మాధవన్ విషయానికొస్తే.. ఆయన ఇటీవల 'ధురంధర్ 2' అనే భారీ చిత్రంలో అలరించారు. సినిమా రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గానూ వచ్చే వారం భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక 'పద్మశ్రీ' అవార్డును కూడా అందుకోబోతున్నారు. అటు తండ్రి అవార్డులతో, ఇటు కొడుకు స్పోర్ట్స్ మెడల్స్ తో మాధవన్ ఇంట ప్రస్తుతం పండగ వాతావరణం నెలకొంది. రాబోయే రోజుల్లో వేదాంత్ ఒలింపిక్స్ వేదికపై భారత్ తరఫున మరిన్ని అద్భుతాలు సృష్టించాలని క్రీడా మరియు సినీ వర్గాలు ఆకాంక్షిస్తున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com