Home

»

Latest News

Dhurandhar: ధురంధర్ పై దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఆగ్రహం..ముంబైలో భారీ ఉగ్రకుట్రకి ప్లాన్ 

Jun 1, 2026 6:38PM

 

ముంబై మహానగరాన్ని మరోసారి నెత్తుటి మడుగుగా మార్చేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ‘డి' కంపెనీ’ పన్నిన ఒక భయంకరమైన ఉగ్ర కుట్రని భారత భద్రతా దళాలు అత్యంత చాకచక్యంగా భగ్నం చేశాయి. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’(Dhurandhar)సినిమా కథాంశం, అండర్ వరల్డ్ శక్తుల వాస్తవాలని కళ్లకి కట్టినట్టు చూపించడంతో పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీం, అతని ముఠాకి  తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 


ఈ సినిమా తెచ్చిన సెగతో ముంబైలో తమ ఉనికి చాటుకోవడానికి, కోల్పోయిన పాత పట్టుని  మళ్లీ సాధించుకోవడానికి డి-కంపెనీ పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ISI) తో చేతులు కలిపి ఈ భారీ విధ్వంసక ప్లాన్ రచించింది. ఈ  మిషన్‌ని సఫలం చేసేందుకు ముంబైలోని స్థానిక ముఠాలు, నిరుద్యోగ యువతని ఆకర్షించే బాధ్యతని దావూద్ అత్యంత నమ్మకస్తుడైన ఛోటా షకీల్ గ్యాంగ్‌ కి అప్పగించారు. వీరికి అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు మరియు భారీ నిధులను సమకూర్చే బాధ్యతను ఐఎస్‌ఐ తీసుకుంది. అలాగే ఈ ఆపరేషన్ మొత్తాన్ని గ్రౌండ్ లెవల్‌లో నడిపించే బాధ్యతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మున్నా జింగాడా భుజాలకెత్తుకున్నాడు.

ఈ కుట్రలో భాగంగా స్థానిక యువత మైండ్ వాష్ చేయడానికి ముంబైలోని బాంద్రా గరీబ్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక ఘటనని  వారు అస్త్రంగా వాడుకున్నారు. రైల్వే స్థలంలో ఉన్న అక్రమ కట్టడాలను, అందులోని ఒక మసీదును అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసినప్పుడు స్థానికులకి, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ అల్లర్లలో 10 మందికి పైగా పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలనే సాకుతో ముంబైకి చెందిన కొంతమంది యువకులను తప్పుదోవ పట్టించి ఈ ముఠాలో చేర్చుకున్నారు. అయితే అసలు ప్లాన్ బాంద్రా ఘటనకు ప్రతీకారం కాదని, ముంబైలో భారీ ఎత్తున రక్తపాతం సృష్టించడమేనన్న నిజాన్ని ఆ యువకుల వద్ద దాచిపెట్టారు. పట్టుబడిన నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన డేటా ప్రకారం, వారు ముంబైలోని దాదర్ రైల్వే బ్రిడ్జితో పాటు పలు అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే ప్రాంతాలను రేకీ నిర్వహించి వీడియోలు తీసినట్లు తేలింది.


Also read: Peddi: చరణ్ బాడీగార్డ్ కే బాడీ గార్డ్స్ ఉండాల్సిన పరిస్థితి.. వైరల్ అవుతున్న వీడియో


ఈ కుట్రను పసిగట్టిన ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించింది. ముంబై, ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి, ఐఎస్‌ఐ-దావూద్ నెట్‌వర్క్‌కు చెందిన మొత్తం 9 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన సాజిద్ మెహబూబ్ షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్, ముంబ్రా ప్రాంతానికి చెందిన తౌకీర్ రిజ్వాన్ షేక్ అనే ఇద్దరు ప్రధాన ఏజెంట్లను మే 27న పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, సజీవంగా ఉన్న హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని పోలీస్ స్టేషన్లు, భద్రతా దళాల క్యాంపులు, రద్దీగా ఉండే మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అంధాధుందంగా కాల్పులు జరపాలని, హ్యాండ్ గ్రెనేడ్లతో దాడులు చేయాలని పాకిస్తాన్, దుబాయ్ దేశాల్లోని హ్యాండ్లర్స్ నుండి వీరికి వాయిస్ నోట్స్, వాట్సాప్ చాట్స్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు అందినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. సకాలంలో 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి విచారించడంతో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై లలో జరగాల్సిన ఒక ఘోరమైన ఉగ్ర విపత్తు తప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించి, ఈ నెట్‌వర్క్‌కి  సంబంధించిన మిగిలిన నిందితుల కోసం గాలింపును తీవ్రం చేశాయి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com