Home

»

Latest News

OTT: 10 కోట్ల బ‌డ్జెట్‌తో థియేటర్లలో 75 కోట్లు క‌లెక్ట్ చేసిన మూవీ రివ్యూ

Apr 10, 2026


 

- నవ్వూ.. ఏడుపు.. ఎమోషన్ల కలయిక ఈ చిత్రం!

- బామ్మగారి బంగారం కోసం కొడుకుల వేట.. 

- న‌ట విశ్వ‌రూపం చూపించిన రాధిక‌

దక్షిణాది సినీ రంగంలో సీనియర్ నటి రాధికా శరత్ కుమార్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఆమె ‘తాయ్ కిళవి’ చిత్రంలో త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 27న త‌మిళ్‌లో విడుద‌లైన ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. కేవ‌లం 10 కోట్ల బ‌డ్జెట్‌తో తాయ్ కిళ‌వి 75 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది. జియో హాట్ స్టార్‌లో తెలుగు, త‌మిళ్‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక పక్కా ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ కామెడీ డ్రామా. ఈ సినిమాకి సంబంధించిన స‌మీక్ష‌ను ఇక్క‌డ చూద్దాం. 

క‌థ :
కరుమత్తూర్ అనే గ్రామంలో పవునుత్తాయి (రాధిక) అంటే అందరికీ హడల్. చేతిలో చుట్ట, నోట్లో పవర్ ఫుల్ డైలాగులతో ఊరు మొత్తాన్ని తన కంట్రోల్‌లో ఉంచుకునే మొండి మనిషి ఆమె. వడ్డీ వ్యాపారం చేస్తూ, తన ముగ్గురు కొడుకులను కూడా లెక్కచేయని ధీరవనిత. అయితే, ఒకరోజు హఠాత్తుగా ఆమె పక్షవాతం బారిన పడి మంచాన పడుతుంది. ఆమె చనిపోవాలని కోరుకునే కొడుకులు, ఆమె దగ్గర 160 తులాల బంగారం ఉందని తెలియగానే సీన్ మారుస్తారు. మంచం మీద ఉండి కేవలం సైగలు మాత్రమే చేసే పవునుత్తాయి ఏం చెప్పాలనుకుంది? ఆ బంగారం చివరకు ఎవరికి దక్కింది? అనేదే ఈ చిత్ర ప్రధానాంశం.

విశ్లేషణ :
దర్శకుడు శివకుమార్ మురుగేశన్ ఒక సింపుల్ పాయింట్‌ను తీసుకుని దానికి గ్రామీణ హాస్యాన్ని, భావోద్వేగాలను అద్ది అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా సినిమా మొదటి భాగం మొత్తం పాత్రల పరిచయం, రాధిక మార్కు ‘మాస్’ మేనరిజమ్స్‌తో సరదాగా సాగిపోతుంది. ముగ్గురు కొడుకులుగా నటించిన సింగం పులి, అరుళ్ దాస్, బాలా శరవణన్ తమదైన కామెడీతో నవ్వులు పూయించారు. సెకండ్ హాఫ్‌లో సినిమా కాస్త నెమ్మదించినా, ఎమోషనల్ సీన్లు ఆ లోటును భర్తీ చేస్తాయి.

నటీనటుల పనితీరు :
ఈ సినిమాకు అసలైన బలం రాధికా శరత్ కుమార్. డెబ్బై ఏళ్ల బామ్మగా ఆమె చూపించిన నటన అమోఘం. మాట లేకపోయినా కేవలం కళ్లతో, సైగలతోనే ఆమె పండించిన హావభావాలు నటిగా ఆమె స్థాయిని మరోసారి నిరూపించాయి. ఇక మునీష్ కాంత్, రైచల్ రెబాకా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నివాస్ ప్రసన్న అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి.

బ్యాక్‌గ్రౌండ్ అండ్ బజ్ :
రాధిక చాలా కాలం తర్వాత ఒక పవర్‌ఫుల్ లీడ్ రోల్‌లో నటించడంతో ఈ సినిమాపై కోలీవుడ్‌లో మంచి బజ్ ఏర్పడింది. సెన్సార్ సభ్యులు సైతం ఈ సినిమాను చూసి ఫిదా అయిపోయి ‘క్లీన్ యు’ సర్టిఫికేట్ ఇచ్చారు. సూర్య, జ్యోతిక, శివకార్తికేయన్ వంటి ప్రముఖులు సైతం ఈ సినిమాను చూసి రాధిక నటనను ప్రశంసించడం విశేషం. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ తన తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

చివర‌గా :
‘తాయ్ కిళవి’ కేవలం ఒక కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇంటిని నడిపే మహిళా శక్తిని చాటిచెప్పే చిత్రం. అక్కడక్కడ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ మరియు ఎమోషన్ ప్రేక్షకుడి మనసును బరువెక్కిస్తాయి. కచ్చితంగా కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఎంటర్‌టైనర్ ఇది. ముఖ్యంగా రాధికా శరత్ కుమార్ అభిమానులకు ఇదొక ఐ ఫీస్ట్ అని చెప్పక తప్పదు. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com