Home

»

Latest News

మద్యం మత్తులో సెల్ఫీ.. విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభ‌వం.!

Oct 29, 2026 7:21PM

మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ కీర్తి సురేష్‌కు విమాన ప్రయాణంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. సాధారణంగా అభిమానులతో సరదాగా మాట్లాడటం, వారితో ఫొటోలు దిగడం ఇష్టపడే కీర్తికి.. ఓ వ్యక్తి ప్రవర్తన ఇబ్బందికరంగా మారింది. మిలన్‌ నుంచి ఇండియాకు తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కీర్తి సురేష్‌ ప్రయాణిస్తున్న విమానంలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. సరిగా నిలబడలేని స్థితిలో ఉన్న అతను తనతో సెల్ఫీ దిగాలని పట్టుబట్టాడు. అయితే, ఆ సమయంలో ఫొటో దిగడం సాధ్యం కాదని, కొద్దిసేపటి తర్వాత దిగుదామని కీర్తి చెప్పింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ఆమె మాటలను పట్టించుకోకుండా వెంటనే సెల్ఫీ కావాలని ఒత్తిడి చేశాడు. దీంతో కీర్తి అతనికి గట్టిగా సమాధానం చెప్పాల్సి వచ్చింది. తన తరఫున నిర్ణయం తీసుకునే హక్కు అతనికి లేదని స్పష్టం చేసింది.

ఈ ఘటనలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీర్తి భర్త ఆంటోనీ తట్టిల్‌ కూడా ఆ వ్యక్తి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం. సాధారణంగా అభిమానులతో ఎంతో సౌమ్యంగా ఉండే తన భర్త గొంతు పెంచి మాట్లాడటం తాను మొదటిసారి చూశానని కీర్తి చెప్పింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో చివరకు విమాన సిబ్బంది సహాయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. సెలబ్రిటీలైనా సరే, తమ వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని ఈ సంఘటన ద్వారా ఆమె చెప్పకనే చెప్పారు.

అయితే, విమాన ప్రయాణాల్లో అభిమానులందరి వల్ల ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని కీర్తి అనడం లేదు. చాలామంది ఎంతో మర్యాదగా మాట్లాడతారని, కొందరైతే ఫొటో కూడా అడగకుండా ప్రయాణమంతా సరదాగా కబుర్లు చెబుతుంటారని ఆమె వివరించింది. ప్రేక్షకుల ప్రేమాభిమానాలను తాను గౌరవిస్తానని, అయితే ఎవరైనా హద్దులు దాటి ప్రవర్తించినప్పుడు మాత్రం ఇబ్బంది కలుగుతుందని తెలిపింది. సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలనుకోవడం తప్పు కాకపోయినా, వారి ఇష్టాయిష్టాలను, వ్యక్తిగత పరిధిని గౌరవించడం ముఖ్యమనే విషయం ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చింది.

 

 

[Keerthy Suresh, Keerthy Suresh Flight Incident, Keerthy Suresh Husband Antony Thattil, Keerthy Suresh Interview, Keerthy Suresh Latest News, Celebrity Fan Incident, Keerthy Suresh Selfie Incident]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com