Home

»

Latest News

టాలీవుడ్‌లో ముదురుతున్న 'పర్సెంటేజ్' వివాదం.. మే 1 నుంచి థియేటర్లు బంద్!

Apr 10, 2026

  • టాలీవుడ్‌లో మొదలైన పర్సెంటేజ్ వార్ 
  • నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్
  • పర్సెంటేజ్ గొడవతో థియేటర్ల మూసివేతకు రంగం సిద్ధం!

తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక కొత్త వివాదం రాజుకుంది. 'పర్సెంటేజ్' (శాతం) విధానంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల గిల్డ్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే, అది కుదరదని నిర్మాతలు తెగేసి చెబుతున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరికి మే 1 నుంచి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసే దిశగా అడుగులు పడుతున్నాయి.

పర్సెంటేజ్ విధానం అంటే ఏమిటి?
సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'రెంటల్' విధానం అమలులో ఉంటుంది. అంటే సినిమా ఆడినా ఆడకపోయినా నిర్మాత థియేటర్ యజమానికి నిర్ణీత అద్దె చెల్లించాలి. అయితే, ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సెంటేజ్ విధానాన్ని కోరుతోంది. దీని ప్రకారం, మొదటి వారం వసూళ్లలో 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం థియేటర్ యాజమాన్యానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌లోని సుమారు 23 ప్రధాన థియేటర్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఛాంబర్ స్పష్టం చేసింది.

నిర్మాతల గిల్డ్ అభ్యంతరం..
ఈ పర్సెంటేజ్ విధానంపై నిర్మాతల గిల్డ్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు భారీగా పర్సెంటేజ్ ఇవ్వడం సాధ్యం కాదని, కేవలం అద్దె విధానం (Rental System) ద్వారానే సినిమాలను ప్రదర్శించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెంటల్ విధానానికి ఒప్పుకునే థియేటర్లకే తమ సినిమాలను ఇస్తామని నిర్మాతలు ఖచ్చితంగా చెబుతున్నారు. దీంతో అటు థియేటర్ల యాజమాన్యాలు, ఇటు నిర్మాతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది.

ఫిలిం ఛాంబర్ ఆగ్రహం - లెటర్ వార్!
నిర్మాతల గిల్డ్ వైఖరిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తెలుగు ఫిలిం ఛాంబర్‌ను కాదని గిల్డ్ నిర్ణయాలు తీసుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. "నిర్మాతల గిల్డ్ ఎవరు?" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తెలుగు ఫిలిం ఛాంబర్‌కు ఒక లేఖ కూడా రాశారు. ఈ నెలాఖరు (ఏప్రిల్ 30) లోగా ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.

మే 1 నుంచి థియేటర్ల మూసివేత?
ఒకవేళ ఏప్రిల్ 30 లోగా పర్సెంటేజ్ విధానంపై స్పష్టత రాకపోతే, మే 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. అద్దె విధానం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పర్సెంటేజ్ విధానమే విజయవంతంగా నడుస్తోందని వారు గుర్తు చేస్తున్నారు. 

ప్రేక్షకులపై ప్రభావం..
సమ్మర్ సీజన్ కావడం, రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ థియేటర్ల బంద్ వార్త ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ థియేటర్లు మూతపడితే బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరి ఈ వివాదానికి ఏప్రిల్ 30 లోగా ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com