తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'వారణాసి'పై అంచనాలు ఆకాశాన్నం టుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక గ్లోబ్‌ట్రోటర్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ విడుదల కోసం యావత్ సినీ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీమ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన కౌంట్‌డౌన్ ప్రారంభించడంతో సోషల్ మీడియాలో వారణాసి మానియా మొదలైంది.
సరిగ్గా మరో ఏడాదిలో, అంటే ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెండితెరపై సందడి చేయనుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మధ్య జరిగిన సంభాషణలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంగీత దర్శకుడు కీరవాణి "365" అని పోస్ట్ చేయడం ద్వారా రిలీజ్ కౌంట్‌డౌన్‌ను గుర్తు చేయగా, నిర్మాత కార్తికేయ మొదటి సాంగ్ అప్డేట్ గురించి ఆరా తీయడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సందడి చూస్తుంటే రాజమౌళి మార్క్ భారీ ప్రమోషన్లకు రంగం సిద్ధమైందని స్పష్టమవుతోంది.
దాదాపు 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు 'రుద్ర' అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఆయన ఎద్దుపై స్వారీ చేస్తూ, చేతిలో త్రిశూలం పట్టుకున్న విజువల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ కథ అంటార్కిటికా మంచు ఖండాల నుంచి ఆఫ్రికా దట్టమైన అడవుల వరకు, చివరకు పవిత్ర కాశీ నగరం వరకు సాగే అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఐమ్యాక్స్ ఫార్మాట్లో రాజమౌళి ఈ విజువల్ వండర్‌ను తీర్చిదిద్దుతున్నారు.
హీరోయిన్గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. చాలా కాలం తర్వాత ఆమె భారతీయ సినిమాలో నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. భారీ తారాగణం, విజువల్ ఎఫెక్ట్స్, విజయేంద్ర ప్రసాద్ కథ వెరసి ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్స్‌లో శరవేగంగా జరుగుతోంది. వారణాసి నగరాన్ని తలపించేలా నిర్మించిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంతర్జాతీయ మీడియా సైతం ఈ ప్రాజెక్ట్ వైపు ఆసక్తిగా చూస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది, శ్రీరామనవమి పండుగల కానుకగా 'వారణాసి' థియేటర్లలోకి రానుంది. అప్పటివరకు వరుస అప్డేట్లతో అభిమానులను అలరించడానికి చిత్ర బృందం పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. మహేష్-రాజమౌళి మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే!





