గత 25 సంవత్సరాలుగా విలువలతో కూడిన జర్నలిజంతో తెలుగువన్ సంస్థను నిర్వహిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు కంఠంనేని రవిశంకర్. ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని ఆయన మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 25 సంవత్సరాలుగా నిబద్ధతతో సంస్థను నిర్వహిస్తున్న రవిశంకర్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఆరోగ్యకరమైన జర్నలిజంతో మీడియా సంస్థను నిర్వహిస్తూనే తెలుగువన్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రవిశంకర్. అలాగే తమ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి లైఫ్ సేవింగ్ సర్జరీలు కూడా చేయించారు. ఈ విషయాలు తెలుసుకున్న మెగాస్టార్.. రవిశంకర్‌ను ప్రశంసించారు.
ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, కంఠంనేని రవిశంకర్ పలు అంశాల గురించి చర్చించారు. తమ అభిప్రాయాలను ఇద్దరూ షేర్ చేసుకున్నారు. సినీ రంగానికి సేవ చేస్తూనే సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి సేవా తత్పరతను రవిశంకర్ కొనియాడారు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం చిరంజీవిగారిది. నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన నిజమైన మెగాస్టార్ అని మరోసారి రుజువైంది’ అని కంఠంనేని రవిశంకర్ తెలియజేశారు.






