Home

»

Movie Reviews

ntg

Movie Name : పాపం ప్రతాప్‌

Banner : ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్

Rating : 2.5

Released On : Apr 16, 2026

నటీనటులు: తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, రాశి, అజయ్ ఘోష్, శ్రీనివాస్ అవసరాల, రూపలక్ష్మి, దేవీప్రసాద్, గోపరాజు రమణ, రఘుబాబు తదితరులు
సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్ ఎస్.వి.
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాతలు: రాకేష్‌రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరె
బ్యానర్స్: ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్, కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్
రచన, దర్శకత్వం: ఎస్.పి.దుర్గా నరేష్
విడుదల తేదీ: 17.04.26

ఇటీవలికాలంలో ఈటీవీ విన్ విభిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకొని తక్కువ బడ్జెట్‌తో పెద్ద విజయాలు సాధిస్తోంది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ వంటి సినిమాలు దానికి ఉదాహరణ. అందులో భాగంగానే తాజాగా ‘పాపం ప్రతాప్‌’ పేరుతో మరో విభిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈటీవీ విన్. మరి ఈ సినిమా ఏమేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? గత సినిమాల స్థాయిలో విజయం సాధించిందా? అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: 

అతని పేరు ప్రతాప్(తిరువీర్). పక్క ఊరిలో ఉండే బుజ్జమ్మ(పాయల్ రాధాకృష్ణ)ను చిన్నప్పటి నుంచే ప్రేమిస్తూ ఉంటాడు. అది ఒన్ సైడ్ లవ్ అయినప్పటికీ ఆమె కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధపడతాడు. అలా తండ్రి వీరయ్య(అజయ్ ఘోష్)తో తిట్లు తింటాడు. పెద్దయ్యే సరికి బుజ్జమ్మ సైడ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎంతో ఆర్భాటంగా పెళ్లి జరుగుతుంది. మూడు రాత్రులు అయిన తర్వాత నాలుగోరోజు బుజ్జమ్మ ఆ ఊరిలో పంచాయతీ పెడుతుంది. ప్రతాప్‌తో కలిసి తను ఉండలేనని చెబుతుంది. కారణం అడిగిన ప్రతాప్‌కి నిద్రలో అతను ప్రవర్తించే తీరు తను తట్టుకోలేకపోతున్నానని, అతని సమస్య ఏమిటో తెలుసుకొని దాన్ని తగ్గించుకుంటేనే అత్తారింటికి వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్లిపోతుంది. ప్రతాప్‌కి ఉన్న సమస్య ఏమిటి? పెళ్లయిన మూడు రోజులకే భర్తని వదిలి బుజ్జమ్మ పుట్టింటికి ఎందుకు వెళ్లిపోయింది? భార్య అలా వెళ్లిపోవడం వల్ల ఊరి జనం ముందు అతను ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి? ప్రతాప్ తనకి ఉన్న సమస్య తెలుసుకున్నాడా? అతను తిరిగి మామూలు మనిషి అయ్యాడా? చివరికి ప్రతాప్, బుజ్జమ్మ కలుసుకున్నారా? అనేది మిగతా కథ. 

Analysis :

కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న పాయింట్. దాని చుట్టూ రకరకాల అంశాలను చేర్చి కొంత సెంటిమెంట్, మరికొంత ఎమోషన్, అక్కడక్కడా కామెడీతో రెండున్నర గంటల సినిమాగా మలిచారు. ప్రతాప్ నిద్రలో ఒక సమస్య ఉంది అనే పాయింట్ అంత కన్విన్సింగ్‌గా లేదు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి సమస్య మనం ఎక్కడా చూసి ఉండం. దాంతో ప్రేక్షకులు దానికి కనెక్ట్ అవ్వడం కష్టం. అయితే ఒక కథగా దాన్ని అనుకున్నప్ప్పుడు దాని వల్ల ఎదురయ్యే సమస్యలు కొంత ఎంటర్‌టైనింగ్‌గా తియ్యడం వల్ల ప్రేక్షకులు కూడా దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. తన సమస్యను తెలుసుకోవడం, దాన్ని తగ్గించుకోవడం కోసం ప్రతాప్ చేసే ప్రయత్నాలు సినిమా నిడివిని పెంచేందుకు చేసిందిగా అనిపిస్తుంది. ప్ర‌తాప్ భార్య అత‌న్ని వ‌దిలి వెళ్లిపోయిందని ఊరి జ‌నం నానా మాట‌లు అనే సీన్స్ ఎక్కువ‌గానే ఉన్నాయి. అవి మొద‌ట ఎంట‌ర్‌టైనింగ్‌గా అనిపించినా రాను రాను బోర్ కొట్టిస్తాయి. అయితే మధ్య మధ్య వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఆడియన్స్‌ని నవ్విస్తాయి. అలాగే కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. నిద్రలో సమస్య అనేది ప్రధాన కథ అయినప్పటికీ కథనంలో వేగం ఉండడం, ఎంటర్‌టైనింగ్ సీన్స్ కూడా ఉండడం వల్ల ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వరు. పాపారావు(గోపరాజు రమణ), వీరయ్య(అజయ్ ఘోష్) ఇద్దరూ కలిసి షకీలా సినిమా చూసే సీన్ ఆడియన్స్‌ని బాగా నవ్విస్తుంది. 

నటీనటులు: 

ప్రతాప్ పాత్రలో తిరువీర్ ఒదిగిపోయాడని చెప్పాలి. కామెడీ, సెంటిమెంట్, ఎమోషన్.. ఇలా అన్ని వేరియేషన్స్‌లో మంచి పెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. బుజ్జమ్మ పాత్రలో పాయల్ రాధాకృష్ణ కూడా తన పాత్ర పరిధి మేరకు చక్కని నటన ప్రదర్శించింది. ఇక సినిమాలో ఎక్కువగా కనిపించే పాత్ర వీరయ్యది. కొన్ని సీన్స్‌లో బాగా చేసినా, కొన్నిచోట్ల ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా అనిపిస్తుంది. గోపరాజు రమణ తనదైన శైలిలో కామెడీతో ఆకట్టుకున్నాడు. ప్రతాప్ తల్లిగా రాశి కొన్ని సన్నివేశాల్లో కంట తడి పెట్టిస్తుంది. మిగతా పాత్రల్లో దేవీప్రసాద్, రూపలక్క్ష్మీ, రఘుబాబు, అవసరాల శ్రీనివాస్, ప్రసాద్ బెహరా ఫర్వాలేదు అనిపించారు. 

సాంకేతిక నిపుణులు:

టెక్నికల్ ఎస్సెట్స్ గురించి చెప్పాలంటే.. విశ్వేశ్వర్ ఫోటోగ్రఫీ సాధారణంగా ఉంది. ఈ కథకి, బ్యాక్‌డ్రాప్‌కి మెరుపులు మెరిపించాల్సిన అవసరం లేదు కాబట్టి అందులో విశేషం ఏమీ లేదు. చాలా కాలం తర్వాత కె.ఎం.రాధాకృష్ణన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు. అతను చేసే తరహా మ్యూజిక్ ఈ కథకు అవసరం లేదు కాబట్టి పాటలు కూడా సాధారణంగానే ఉన్నాయి. ఒక మెలోడీ సాంగ్ మాత్రం ఆనంద్, గోదావరి వంటి సినిమాలను గుర్తు చేసింది. సురేష్‌ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు అనిపించింది. అన్వర్ అలీ ఎడిటింగ్‌లో కూడా మెరుపులు ఏమీ లేవు. అది కూడా సాధారణంగానే ఉంది. డైరెక్టర్ దుర్గా నరేష్ గురించి చెప్పాల్సి వస్తే.. ఒక చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల సినిమా నడిపేందుకు కావాల్సిన సరంజామా అంతా బాగానే ఏర్పాటు చేసుకొని ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వకుండా చూశాడు. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు. హీరోకి ఉన్న సమస్య ఏమిటి అనేది రివీల్ చెయ్యకుండా సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేశాడు. ఒక సందర్భంలో ఆ సమస్య ఏమిటో రివీల్ చేసినట్టుగా అనిపించినా, పూర్తి స్థాయిలో అది కాదు అని అసలు సమస్య చెప్పి చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. అయితే క‌థ ఎప్పుడు క్లైమాక్స్ వ‌స్తుంది అని ఆడియ‌న్స్ ఎదురుచూసేలా చివ‌రి అర‌గంట‌ను సాగ‌దీసే ప్ర‌య‌త్నం చేశాడు.  

ప్లస్ పాయింట్స్: 

సెంటిమెంట్ సీన్స్‌
ఎమోషనల్ సీన్స్‌
కామెడీ
ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌

మైనస్ పాయింట్స్:

ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వని పాయింట్
ల్యాగ్ సీన్స్
రిపీటెడ్ సీన్స్
కథను క్లైమాక్స్‌కి తీసుకు రావడంలో తాత్సారం

TeluguOne Perspective :

కథ ఎలా ఉన్నా.. కామెడీ కోసం, కొన్ని సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ కోసం సినిమా చూడొచ్చు. 

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com