Home

»

Movie Reviews

ntg

సినిమా పేరు : కింగ్‌డమ్

బ్యానర్ : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకరా స్టూడియోస్

Rating : 2

విడుదలయిన తేది : Jul 30, 2025

తారాగణం: విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్, 
సంగీతం: అనిరుధ్ రవిచందర్
డీఓపీ: జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
ఆర్ట్: అవినాష్‌ కొల్లా
ఎడిటర్: నవీన్ నూలి
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
విడుదల తేదీ: జూలై 31, 2025 

 

'పెళ్ళి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' వంటి ఘన విజయాలతో కెరీర్ స్టార్టింగ్ లో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ.. తర్వాత ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోయాడు. విజయ్ నటించిన గత ఐదు చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో 'కింగ్‌డమ్'పైనే ఆశలు పెట్టుకున్నాడు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'కింగ్‌డమ్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? విజయ్ ఎదురుచూస్తున్న విజయాన్ని అందించేలా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

 

కథ:
సూరి(విజయ్ దేవరకొండ) ఒక కానిస్టేబుల్. 18 ఏళ్ళ క్రితం ఇంటి నుంచి పారిపోయిన తన అన్నయ్య శివ(సత్యదేవ్) కోసం వెతుకుతుంటాడు. సూరి ధైర్యం, తెలివితేటలు తెలుసుకున్న సీనియర్ ఆఫీసర్.. ఒక అండర్ కవర్ ఆపరేషన్ అప్పగిస్తాడు. శ్రీలంక తీరంలో భారత్ కి చెందిన తెగ నివసిస్తుంది. వాళ్ళు అక్కడి స్వగ్లర్ల కింద పనిచేస్తూ నేరాలకు పాల్పడుతుంటారు. ఆ గ్యాంగ్ కి లీడర్ సూరి అన్నయ్య శివనే. తన అన్నయ్యని తిరిగి ఇండియాకి తీసుకురావాలనే లక్ష్యంలో సూరి అక్కడికి బయల్దేరతాడు. నోటితో కాకుండా ఆయుధాలతో మాట్లాడే రాక్షసులు లాంటి మనుషులున్న ఆ ప్రాంతానికి సూరి ఎలా వెళ్ళగలిగాడు? శివని ఇండియాకి తీసుకొనివచ్చాడా? అసలు ఆ తెగతో శివకి, సూరికి సంబంధం ఏంటి? అండర్ కవర్ ఆపరేషన్ వెనకున్న అసలు లక్ష్యం ఏంటి? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

ఎనాలసిస్ :

కింగ్‌డమ్ కథ పెద్దది కాదు. ట్రైలర్ చూసినప్పుడే ఈ చిత్ర కథ ఏంటో అవగాహన వస్తుంది. లేదా సినిమా ప్రారంభమైన కాసేపటికే కథ ఏంటో అర్థమైపోతుంది. ఇలా చిన్న కథని తీసుకొని, దానిని ముందే ఆడియన్స్ కి చెప్పేసి.. రెండున్నర గంటలు కూర్చోబెట్టడం అంత తేలికైన విషయం కాదు. రైటింగ్ తో మ్యాజిక్ చేయాలి. కానీ, అలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు.

ఈ మధ్య అవసరమున్నా లేకున్నా రెండు భాగాలుగా కథ చెప్పడం ట్రెండ్ అయిపోయింది. దాని వల్ల మొదటికే మోసం వస్తుంది. సెకండ్ పార్ట్ కోసం మంచి కంటెంట్ ఉండాలనే ఉద్దేశంతో.. ఫస్ట్ పార్ట్ ని డ్రాగ్ చేస్తున్నారు. ఇప్పుడు కింగ్‌డమ్ విషయంలోనూ అదే జరిగింది.

తెలుగులో తీసింది రెండు సినిమాలే అయినప్పటికీ గౌతమ్ తిన్ననూరి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మళ్ళీ రావా, జెర్సీ సినిమాలతో తన బలం రైటింగ్ అని నిరూపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ కింగ్‌డమ్ లో మాత్రం ఆ ఎమోషన్సే మిస్ అయ్యాయి.

18 ఏళ్ళ క్రితం పారిపోయి గ్యాంగ్ స్టర్ లా మారిన అన్నను తీసుకురావడం కోసం తమ్ముడు ఆ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టడం, దానిని ఒక తెగతో ముడి పెట్టడం.. ఆలోచన వరకు బాగానే ఉంది. కానీ, దానిని తెరమీదకు ఆసక్తికరంగా తీసుకురాలేకపోయారు. అన్నదమ్ముల మధ్య భావోద్వేగాలు సరిగా పండలేదు. ఏదో సినిమా నడుస్తుంటుంది అంతే. ఆ కథతో కానీ, అందులోని పాత్రలతో కానీ ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. అసలు ఈ కథ ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థంకాని విధంగా.. గందరగోళంగా కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సన్నివేశాల వల్ల నిడివి పెరగడం తప్ప కథకు పెద్దగా ఒరిగిందేమీ లేదు.

ఇది గ్యాంగ్ స్టర్ డ్రామా అయినప్పటికీ ఇందులో వావ్ మూమెంట్స్ పెద్దగా లేవు. ఫస్ట్ హాఫ్ కాస్త పరవాలేదు కానీ, సెకండ్ హాఫ్ పూర్తిగా తేలిపోయింది. ముఖ్యంగా విజయ్ అభిమానులు నిరాశచెందే అవకాశముంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో విజయ్ పతాక సన్నివేశాల్లో తప్ప.. మిగతా అంతా ఒక సాధారణ పాత్రలా అక్కడక్కడా మెరుస్తాడు. 

అసలు ఈ కథను ఒకే భాగంగా తెరకెక్కిస్తే.. అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది అనిపిస్తుంది. క్లైమాక్స్ ను ఇంటర్వెల్ లా చూపించి, రెండో భాగంలో చెప్పాలనుకున్న కథను సెకండ్ హాఫ్ లో చెప్పి ఉండాల్సింది. అప్పుడు అనవసరమైన సీన్స్ పోయి.. స్క్రీన్ ప్లే టైట్ గా ఉండేది. ఏది ఏమైనా కథకుడిగా గౌతమ్ తిన్ననూరి బాగా నిరాశపరిచాడని చెప్పవచ్చు.

 

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
సూరి పాత్రలో విజయ్ దేవరకొండ చక్కగా ఒదిగిపోయాడు. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా కొత్త విజయ్ కనిపించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో విజయ్ నటన ఆకట్టుకుంది. భాగ్యశ్రీ బోర్సే పోషించిన మధు పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఉన్నంతలో పరవాలేదు అనిపించుకుంది. సూరి అన్నయ్య శివ పాత్రలో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ఇక మురుగన్ గా వెంకటేష్ ఆకట్టుకున్నాడు. అయ్యప్ప పి శర్మ, గోపరాజు రమణ, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

కింగ్‌డమ్ మూవీ సాంకేతికంగా ఉన్నతంగా ఉంది. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ కెమెరా పనితనం టాప్ క్లాస్ లో ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మాత్రం ఈసారి పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. పాటలు జస్ట్ ఓకే. నేపథ్య సంగీతంలో కూడా పూర్తిస్థాయిలో తన మార్క్ కనిపించలేదు. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తన ప్రతిభ కనిపించింది. సినిమా నేపథ్యానికి, కథ జరిగిన కాలానికి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన వర్క్ ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

 

ప్లస్ పాయింట్స్:
- విజయ్, సత్యదేవ్ నటన
- నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:
- కథనం 
- భావోద్వేగాలు 

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్ :


సినిమా అనేది ఒక సామ్రాజ్యం అయితే.. దానిని నిలబెట్టేది రచనే. కానీ, కింగ్‌డమ్ విషయంలో ఆ రచనే తేలిపోయింది. విజయ్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చే అవకాశాలు తక్కువే.

 

 

Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Organisation recommends viewers' discretion before reacting to this opinionated take.

google-ad-img

INTERESTING NEWS

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com