![]() |
![]() |

'చూడాలని వుంది' సినిమాలోని ఒక సీన్‌లో చిరంజీవికి సౌందర్య, "పద్మావతీ పద్మావతీ.. నీ ఎర్రని మూతి.. చూడగానే పోయింది నా మతి.. ఐపోయింది నా మనసు కోతి.." అంటూ ఓ ఉత్తరంలోని మాటలని చదివి వినిపిస్తుంది. ఇప్పటికీ ప్రేక్షకులు ఆ సన్నివేశాన్నీ, సౌందర్య ముద్దు ముద్దు పలుకుల్నీ మర్చిపోలేదు. తెరపై ఆ మాటల్ని వల్లెవేసింది సౌందర్య అయినా, తెరవెనుక ఆ మాటలు పలికింది సునీత! అవును. సౌందర్యకేమిటి.. 120 మందికి పైగా హీరోయిన్లకు గాత్రదానం చేశారు సునీత.
ఓవైపు గాయనిగా వేలాది పాటలు ఆలపించిన ఆమె, గాయని చిత్ర తర్వాత ఎక్కువ మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన కళాకారిణిగా నిలిచారు. మొదటి భర్తకు చాలా కాలం క్రితమే విడాకులిచ్చి, ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ వచ్చిన సునీత.. కొంత కాలం క్రితం మ్యాంగో మ్యూజిక్ అధినేత రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకోవడం హెడ్‌లైన్స్‌లోకి ఎక్కింది. కొంతమంది ఆమె చర్యను సమర్థించగా, మరికొంతమంది 'ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లయ్యాక రెండో పెళ్లి చేసుకోవడం అవసరమా?' అంటూ సోషల్ మీడియాలో విమర్శించారు. అయితే రెండో వివాహంతో తాను చాలా ఆనందంగా ఉన్నాననీ, నిజానికి తను మళ్లీ పెళ్లిచేసుకోవాలని తన పిల్లలే కోరుకున్నారనీ సునీత ఆ తర్వాత చెప్పారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సునీతకు ఈ ట్రోల్స్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. "మీ రెండో పెళ్లి గురించి, ఈ టైమ్‌లో, ఈ ఏజ్‌లో ఎందుకు చేసుకున్నారు? లాంటి ట్రోల్స్‌కు మీ సమాధానమేమిటి?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, మీరందరూ అంటుంటారుగా.. చిత్ర గారి తర్వాత 121 మంది హీరోయిన్స్‌కు డబ్బింగ్ చెప్పానని. చాలామందికి ఎంటర్‌టైన్‌మెంట్‌కి నేను కారణభూతమయ్యాను అంటారు. ఇన్ని మంచి విషయాలున్నప్పుడు నా పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ ఎందుకు? సంస్కారవంతుల లక్షణమేంటంటే.. మనిషిని ఒక మాటనేముందు, ఒక్క నిమిషం ఆలోచించాలి.. వాళ్లేం మాట్లాడుతున్నారో" అంటూ ఎమోషనల్ అయ్యారు సునీత.
![]() |
![]() |